‘మా’ ఎన్నికలు: కడుపులో కత్తులు.. పైకేమో నవ్వలు.!

 

ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు.. ‘మా’ ఎన్నికలు అత్యంత జుగుప్సాకరంగా జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ద్వారా ఎవరికీ వచ్చే అదనపు లబ్ది ఏమీ లేదు. కానీ, ఆధిపత్య పోరు.. అంతకు మించి పరువు ప్రతిష్టల సమస్య. ఎవరి పరువు.? ఎవరి ప్రతిష్ట.? ఎవరి ఆధిపత్యం.? ఏ ప్రశ్నకీ సరైన సమాధానం దొరకదు.

సిల్లీగా గల్లీలో ఫైట్ చేసుకున్నట్టే తిట్టుకున్నారు ‘మా’ ఎన్నికల నేపథ్యంలో సినీ నటులు. ఇప్పుడేమో తామంతా కలిసిపోయామంటున్నారు. అన్నీ ప్లాస్టిక్ నవ్వులే. ఔను, కొనితెచ్చుకున్న నవ్వులు తప్ప, ఎవరి మొహంలోనూ స్వచ్ఛమైన నవ్వు కనిపించడంలేదు.

‘కడుపులో కత్తులు పెట్టుకుని, పైకి నవ్వుతూ కౌగలించుకుంటున్నారు..’ అన్న భావన, ‘మా’ ఎన్నికల ప్రసహనాన్ని చూస్తున్నవారంతా భావిస్తున్నారు. ప్రకాష్ రాజ్ – మోహన్ బాబు ముచ్చటించుకున్నారు. మంచు విష్ణు – ప్రకాష్ రాజ్ కౌగలించుకున్నారు. ‘అబ్బే, ప్రకాష్ రాజ్‌తో గొడవ పడలేదు’ అని నరేష్ అంటున్నారు.

ఇదంతా పోలింగ్ రోజు సందడి. కానీ, ప్రకాష్ రాజ్ సహా నటులందరిలోనూ, ‘నటన’ స్పష్టంగా కనిపిస్తోంది. అందరూ నవరస నటనా సార్వభౌములే. ‘మీడియాకి బోల్డంత వినోదాన్నిచ్చాం కదా..’ అని కొందరు సినీ నటులు వెటకారం చేయొచ్చుగాక. ఆ వెటకారంలో కూడా నటనే కనిపిస్తోందన్న అభిప్రాయమైతే స్పష్టంగా కనిపిస్తోంది ఈ తతంగాన్ని పరిశీలిస్తున్నవారిలో.

‘మాది సినిమా కులం.. మేమంతా సినీ కళామతల్లి బిడ్డలం..’ అని చెప్పుకుంటూ, ‘స్థానికత’ పేరుతో తిట్టుకున్నారు. చిత్రంగా, ముంబై నుంచి ఓటు వేయడానికి వచ్చిన భామల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు పోలింగ్ కేంద్రంలో. ఎవర్ని ఏమార్చడానికి ఇదంతా.? ఇంత నటన అవసరమా.?