‘మా’ యుద్ధం రావణ కాష్టాన్ని తలపిస్తోంది. ఇప్పట్లో అది చల్లారదు. పోలింగ్ రోజున పెద్ద గొడవ జరిగింది. బూతులు తిట్టుకున్నారు. కొరుక్కున్నారు. కొట్టుకున్నారు. అయినా కానీ, ఆల్ ఈజ్ వెల్ అన్నారు. పైకి నవ్వులు చిందించడం, తెర వెనకాల కుమిలిపోవడం లేదా గోతులు తవ్వడం సినీ పరిశ్రమలో మామూలే.
ఆ నటనా ప్రతిభ సినిమాల్లో చూపించడం సంగతెలా ఉన్నా, ‘మా’ ఎన్నికల యుద్ధంలో చాలా మంది ప్రదర్శించి నవ్వుల పాలయ్యారు. తాజాగా ‘మా’ ఎన్నికల పోలింగ్ రోజున జరిగిన యుద్దంపై ప్రకాష్ రాజ్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆనాటి ఘటనలకు సంబంధించి వీడియో ఫుటేజ్ కావాలని ప్రకాష్ రాజ్లి ఖిత పూర్వకంగా ఎన్నికల అధికారిని కోరారు.
ఫుటేజీ ట్యాంపరింగ్ జరిగే అవకాశముందనీ ప్రకాష్ రాజ్ ఆరోపిస్తుండగా, ఆ ఫుటేజీ యథా తధంగా చాలా భద్రంగా ఉందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మీడియాని లోపలికి రానీయకుండా చేయడం ద్వారా లోపల ఏం జరిగిందో బాహ్య ప్రపంచానికి తెలియకుండా సినీ జనాలు జాగ్రత్త పడ్డారు.
అయితే, బాధితులు.. అనగా తన్నులు తిన్నవారు లేదా బూతులు తిట్టించుకున్నోళ్లు, లేదా కొరకడం వల్ల గాయపడ్డ వారు క్రమక్రమంగా మీడియా ముందుకొస్తున్నారు. కొరుకుడు బాధితుడు శివ బాలాజీ ఇంకా ఈ వ్యవహారంపై తదుపరి చర్యలకు ఉపక్రమించలేదు. అలాగని అతనికి జరిగిన విషయాన్ని చిన్నదిగా చూడలేం. ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవల్సిన పరిస్థితి ఎదురైంది మరి.
శారీరకంగా తగిలిన గాయాల కంటే, మానసికంగా తగిలిన గాయాలే చాలా ప్రమాదకరమైనవి. అవి పైకి కనిపించవు. సీనియర్ నటుడు బెనర్జీ పడ్డ అవమానమే ఇందుకు నిదర్శనం. ప్రకాష్ రాజ్ కోరాడని కాదు కానీ, అసలు రణరంగానికి సంబంధించి నిజాలు నిగ్గు తేలాలి. ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి.
ప్రకాష్ రాజ్ అబద్దం చెబుతున్నాడా.? నిజంగానే అత్యంత జుగుప్సాకరమైన చర్యలకు కొందరు సినీ ప్రముఖులు పాల్పడ్డారా.? సీసీ కెమెరా పుటేజీలో దాగున్న నిజం, నిప్పులాంటి నిజం బయటికొచ్చేదెప్పుడు.?