మా ఎన్నికలు: మంచు విష్ణు.. ఎందుకింత గందరగోళం.?

Movie Artists Association.. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్ష ఎన్నికలెప్పుడు జరుగుతాయో తెలియదు. ఈలోగా నేనే అధ్యక్ష బరిలోకి దిగుతున్నానంటూ ప్రకాష్ రాజ్ ఓ ప్యానెల్ ద్వారా మీడియా ముందుకొచ్చారు. మరోపక్క, ప్రకాష్ రాజ్ మీద ‘నాన్ లోకల్’ ముద్ర కూడా పడింది. మంచు విష్ణు కూడా బరిలో వున్నానంటున్నాడు. నానా రకాల ఆరోపణలు, వివాదాలతో ‘మా’ ఎలక్షన్స్ అయోమయంలో పడ్డాయి. సినీ పరిశ్రమ పెద్దలంతా ఏకగ్రీవంపై ఓ నిర్ణయం తీసుకుంటే, తాను బరిలోంచి తప్పుకుంటానని ఇప్పటికే చెప్పాడు మంచు విష్ణు. తాజాగా, బాలకృష్ణ అధ్యక్ష ఎన్నిక కోసం పోటీ పడితే బావుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అగ్ర హీరోలు ‘మా’ అధ్యక్షుడిగా ఎంపికైతే, ఎక్కువ సమయం ‘మా’ కార్యకలాపాలకు కేటాయించడం కష్టమవుతుదని కూడా మంచు విష్ణు చెబుతున్నాడు.

నాగబాబుతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయనీ, ఆయన తనకు తండ్రి లాంటివారని చెబుతూనే.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి సంబంధించి తన ప్రతిపాదనలేంటో ముందు ముందు వివరంగా చెబుతానంటూ, ఒకింత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు. విష్ణు దగ్గర ‘మా’ భవనానికి సంబంధించిన ప్రణాళిక ఏంటి.? అని నాగబాబు ప్రశ్నించడంపై విష్ణు ఇలా స్పందించాడు. భవనం మొత్తం తన కుటుంబమే నిర్మిస్తుందని ఇప్పటికే మంచు విష్ణు ప్రకటించాడు. కానీ, బాలయ్య వాదన ఇంకోలా వుంది. విష్ణుకి మద్దతిస్తూనే, ప్రభుత్వం నుంచి స్థలాన్ని సేకరించలేనంత చేతకానితనం పరిశ్రమ పెద్దలో వుందని బాలయ్య ఎద్దేవా చేసిన విషయం విదితమే. తనకు ‘మా’ చాలా చిన్న విషయమని, దాన్ని పట్టించుకునేంత తీరిక తనకు లేదని కూడా బాలయ్య చెప్పుకొచ్చారు. అయినా, విష్ణ ఎందుకు బాలయ్యను ఇందులోకి లాగుతున్నట్లు.? నిజానికి, ఏకగ్రీవం అన్న ఆలోచనని నాగబాబు ఖండిస్తున్నారు. ఎన్నికలు జరగడమే మంచిదని అంటున్నారాయన. ఏకగ్రీవం అయితే బరిలోంచి తప్పుకుంటానని మంచు విష్ణు చెబుతున్నప్పుడు, పోటీ చేస్తానని ఆయన ముందుకు రావడం వెనుక ఆంతర్యమేంటి.? పైగా, పరిశ్రమకు సంబంధించి అతిగా మాట్లాడుతున్న కొందరు జైలుకెళ్ళే పరిస్థితి వస్తే, తామే అతన్ని రక్షించామని చెప్పడం దేనికి సంకేతం.?