‘మా’ ఎన్నికలు: ఈసారి గెలిచేదెవరు.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు గతంలో కంటే ఈసారి మరింత రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి. ఔను మరి, ఎన్నిక తేదీ ఎప్పడన్నది ప్రకటితమవకుండానే పెద్ద రచ్చ జరిగింది. ‘ఎన్నిక పెట్టండి మహాప్రభో..’ అంటూ కొందరు రచ్చకెక్కితే తప్ప, ఎన్నిక తేదీ ఖారారు కాలేదాయె. ఈ క్రమంలో మాటల తూటాలు పేలాయ్.. కాదు కాదు, శతఘ్నుల మోత మోగిందనడం సబబేమో. ప్రాంతీయత, కులం.. ఇలా అన్ని అంశాల్నీ తెరపైకి తెచ్చేశారు. ఇంతకీ, ఈసారి బరిలోకి దిగబోయేవారిలో గెలుపెవరిది.? ప్రకాష్ రాజ్.. అందరికన్నా ముందు గొంతు విప్పారు.. ఆ తర్వాత చాలా పేర్లు తెరపైకొచ్చాయి. పూర్తి ప్యానల్.. అంటూ ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ నుంచి తొలి ప్రకటన గతంలోనే వచ్చేసింది. ఇతర ప్యానళ్ళేవీ ఇంకా ప్రకటితం కాలేదు.

కానీ, తెరవెనుకాల వ్యవహారాలు నడిచిపోతున్నాయి. సభ్యుల ఓట్లు కీలకం కావడంతో, ప్రలోభాల పర్వం కూడా షురూ అయ్యిందని అంటున్నారు. ఒకరేమో ‘మా’ కార్యాలయం కట్టేస్తామని ఇప్పటికే ప్రకటించేశారు. ఇంకొకరు ఇంకో రకమైన ఆరోపణలు చేస్తున్నారు, వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. అంతిమంగా అందరూ చెప్పేదొకటే, ఎన్నిక పూర్తయ్యేవరకే ఈ మాటలు, ఆ తర్వాత అందరం కలిసే వుంటామని. ‘మా’లో అవినీతి జరిగిందనే చర్చ తెరపైకొచ్చింది. అదంతా తూచ్.. అన్నారు ఇంకొందరు. చిరంజీవి జోక్యంతో, ‘మా’ క్రమశిక్షణా కమిటీ రంగంలోకి దిగి, షోకాజ్ నోటీసులు జారీ చేసి.. ఆ తర్వాత ఎన్నిక తేదీని ప్రకటించడం గమనార్హం. ఎవరు గెలుస్తారు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, బాగా ఖర్చయ్యే ఎన్నిక ఇదేనంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తప్పదు మరి, పోటీ గట్టిగా వున్నప్పుడు.. ఓట్ల కోసం రాజకీయ పార్టీల్లా ఖర్చు చేయాల్సిందే. ఏం చేసినా, ‘మా’ అసోసియేషన్‌ని ఉద్ధరించేయడానికే సుమీ.. అదెలాగన్నది మాత్రం అడక్కూడదంతే.