మా ఎన్నికలు: అసలు కథ ఇప్పుడే మొదలైంది

ఎన్నికలంటే గెలుపోటములు కాదు.. గెలవడమంటే బాధ్యత. ఓటమి అంటే, కొత్త పాఠం నేర్చుకోవడం. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ ఓటమి చెందారు. ఓడిపోయారు గనుక, తెలుగు సినిమా గురించి ప్రత్యేకంగా ఆలోచించడం ప్రకాష్ రాజ్ మానేస్తారా.? ఏమో, అది వేరే సంగతి.

మంచు విష్ణు ఏం చేయబోతున్నారు.? ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ముందున్న లక్ష్యాలేంటి.? బాధ్యతలేంటి.? ‘మా’ భవనం అతి ముఖ్యమైనది. సొంత ఖర్చుతో ‘మా’ భవనాన్ని నిర్మిస్తానని ఇప్పటికే మంచు విష్ణు ప్రకటించారు. సో, వీలైనంత త్వరగా ఆ పనుల్ని మంచు విష్ణు ప్రారంభించాల్సి వుంటుంది. లక్షల్లో కాదు, కోట్లలో ఖర్చయ్యే వ్యవహారమిది.

‘మా’ సభ్యుల సంక్షేమం సహా చాలా అంశాలున్నాయి. ‘మా’ సభ్యులకు సినిమా అవకాశాలు కల్పించడం అనేది మరో పెద్ద బాధ్యత. మంచు విష్ణు గత కొంతకాలంగా సినిమాలు తగ్గించేశాడు. ఆ మాటకొస్తే, మంచు కుటుంబంలో ఎవరూ యాక్టివ్‌గా లేని పరిస్థితి (వరస పెట్టి సినిమాలు చేయడంలేదు) కనిపిస్తోంది సినిమాల్లో. మరెలా, ఇతర సభ్యులకు అవకాశాలు కల్పిస్తారు.?

చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయ్ ‘మా’ సమస్యలు. గెలిచినవారిపై సభ్యుల నుంచి విపరీతమైన ఒత్తిడి వుంటుంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల్ని వివిధ సమస్యలపై ‘శరణు’ కోరాల్సిన బాధ్యత ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు మీద వుంటుంది. అసలే కరోనా కాలం.. ప్రభుత్వాలూ కష్టాల్లో వున్నాయ్.
సో, ఎలా చూసినా ‘మా’ అధ్యక్ష పదవి మంచు విష్ణుకి కత్తి మీద సాము లాంటిదే.