ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్, అడపా దడపా రాజకీయ అంశాల్లోనూ వేలు దూర్చుతాడు. దూర్చడమేంటి.? ఆయన మీద రాజకీయంగా చాలా విమర్శలు, వివాదాలున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో బెంగళూరు నుంచి ఆయన పోటీ చేశారు (ఇండిపెండెంట్).. ఓటమి చవిచూశారు కూడా. ప్రధానంగా బీజేపీకి ఆయన రాజకీయ శతృవుగా మారారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలతో ప్రకాష్ రాజ్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.
మరీ ముఖ్యంగా తెలంగాణలోని అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతుగా నినదిస్తుంటారాయన. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఇది ఆయనకు ప్లస్ పాయింట్ కానుంది. ఇదిలా వుంటే, ప్రకాష్ రాజ్ విషయంలో కొన్ని రాజకీయ శక్తులు తెరవెనుకాల ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. గట్టిగా 1000 ఓట్లు కూడా లేని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ విషయమై ఇంత రాజకీయం అవసరమా.? అన్నది ఓ చర్చ. హేమాహేమీల్ని ఈ రాజకీయాల్లోకి తెలుగు మీడియా లాగుతోంది.
చిరంజీవి మద్దతు ఎవరికి.? బాలకృష్ణ ఎవరికి మద్దతిస్తారు.? ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. నిజానికి, ఎవరు గెలిచినా.. వాళ్ళు మళ్ళీ సినీ పరిశ్రమలో అందరితోనూ కలుపుకుపోవాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కొందరు పనీ పాటా లేనోళ్ళు చేసే సినీ రాజకీయ విమర్శలు తప్ప, సినీ పరిశ్రమలో ఎవరి పని వాళ్ళు చూసుకునేవాళ్ళకి ఈ రాజకీయాలతో పని లేదు. ‘మా’ ప్రతిష్ట దెబ్బ తినకూడదని తాపత్రయ పడుతుంటారు పెద్దలు.
వాళ్ళనే వివాదాల్లోకి లాగుతుంది మీడియా. అంతే తప్ప, ‘మా’కి అసలు రాజకీయమే అవసరం లేదు. ఇది మీడియా బలవంతంగా సినీ పరిశ్రమ మీద రుద్దే రాజకీయం మాత్రమే అంటారు చాలామంది. కానీ, ప్రకాష్ రాజ్ విషయంలో మాత్రం.. రాజకీయం మరింత వెర్రి తలలు వేస్తోంది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ప్రకాష్ రాజ్ పట్ల వ్యతిరేకతతో తెరవెనుక పావులు కదుపుతూ పరిశ్రమ పెద్దల్ని వివాదాల్లోకి లాగుతున్నారు. ఈ తరహా చర్యల పట్ల సినీ పరిశ్రమ అప్రమత్తంగా వుండాలి.