‘మా’ ఎన్నికలు: పోస్టల్ బ్యాలెట్ కుట్ర అట.!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిస్తే లాభమేంటి.? ఎవరికైనా ఆర్థిక లాభం చేకూరుతుందా.? ఛాన్సే లేదు. ఇదో చిన్న అసోసియేషన్. కానీ, పరువు ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ వర్సెస్ మంచు విష్ణు ప్యానెల్.. చిత్ర విచిత్రమైన రాజకీయాలకు తెరలేపుతున్నాయి.

మంచు విష్ణు, ప్రకాష్ రాజ్.. ఇద్దరూ ఒకర్ని మించిన ఎత్తుగడలు ఇంకొకరు వేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను మంచు విష్ణు ప్యానెల్ కొనేసిందన్నది ప్రకాష్ రాజ్ ప్యానెల్ తాజా ఆరోపణ. సభ్యులు చెల్లించాల్సిన మొత్తాన్ని మంచు కుటుంబమే చెల్లిస్తోందనీ, మంచు కుటుంబానికి మేనేజర్ అయిన వ్యక్తి తెరవెనుకాల కథ నడిపిస్తున్నాడనీ ప్రకాష్ రాజ్ ఆరోపించారు.

58 మంది సభ్యుల తరఫున 28 వేల రూపాయల్ని మంచు కుటుంబానికి మేనేజర్ అయిన వ్యక్తి చెల్లించాడట. ఆయా సభ్యుల్ని ప్రశ్నిస్తే, వాళ్ళు అడిగారు.. మేం సంతకం పెట్టేశామని అట్నుంచి సమాధానం వచ్చిందంటూ ప్రకాష్ రాజ్ మీడియా ముందు కంటతడి పెట్టినంత పనిచేశారు.

‘మేం గెలిచేస్తాం..’ అని మంచు విష్ణు ధీమాగా చెబుతోంటే, అసలు కథ ఇదేనని ఇప్పుడు తమకు అర్థమయ్యిందనీ, దయచేసి ప్రలోభాలకు గురయ్యేవారు ఓటు వెయ్యొద్దని జీవిత విజ్ఞప్తి చేశారు. ఈ ఆరోపణలపై మంచు విష్ణు క్యాంప్ గుస్సా అవుతోంది.