‘నా ఫొటోల్ని మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారు..’ అంటూ సీనియర్ నటి ఎందుకు పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రకాష్ రాజ్ స్థానికతపై ఎందుకు రచ్చ జరుగుతుంది.? ‘మతం’ ప్రస్తావన, ‘కులం’ ప్రస్తావన ఎందుకు వస్తోంది.? మంచు విష్ణు కుటుంబ సభ్యుల పేర్లను ఎందుకు తెరపైకి తెస్తున్నారు.?
ఇంతకీ, ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో అధ్యక్ష పీఠం లాభదాయకమైన పదావా.? కాదా.? ఇలా సాధారణ ప్రజానీకంలో పలు అనుమానాలున్నాయి. గతంలో ఫలానా నటుడు అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు దోచేశాడట.. అన్న చర్చ ప్రజల్లో జరగడానికి కారణం, సినీ జనాలు అనుసరిస్తున్న జుగుప్సాకరమైన వైఖరే.
‘మా’ అనేది ఓ చిన్న అసోసియేషన్. వెయ్యి మంది సభ్యులు కూడా లేని అసోసియేషన్ అది. అందులో వందల కోట్లు, వేల కోట్ల రూపాయల నిధులేమీ వుండవు.. వాటిని దోచేసే పరిస్థితీ కూడా వుండదు. అసలు అధ్యక్ష పదవిలో ఎవరు కూర్చున్నా, వారికేమీ పొలిటికల్ ప్రోటోకాల్స్ ప్రత్యేకంగా వుండవు.
ఎలా చూసినా, ‘మా’ అధ్యక్ష పదవి అనేది ‘వపర్ లేని’ ఓ చిన్న పోస్ట్. దాని కోసం సినీ పరిశ్రమలో ఆధిపత్య పోరు నడుస్తోంది. పరువు ప్రతిష్టల సమస్యగా కొందరికి మారిపోయింది. 10 వేల నుంచి పాతిక వేల రూపాయలు కూడా ఓటు కోసం ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
సభ్యుల ఇళ్ళకు వెళ్ళి మరీ ఓటు కోసం అభ్యర్థిస్తున్నారు. ఇరు ప్యానెళ్ళ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ ప్రక్రియ అంతా సినీ పరిశ్రమను మరింత చులకన చేసేస్తోంది ప్రజల్లో. జుగుప్స, అత్యంత జుగుప్సా.. ఇంతకు ముందెన్నడూ ఇంతలా లేదు.. భవిష్యత్తులో వుండకూడదు కూడా. అసలు, ‘మా’ ఎన్నికల కోసం సినీ జనాలెవరూ మీడియాకెక్కొద్దన్న నిబంధన పెట్టుకుంటే బావుంటుందేమో.
ఎవరు అధ్యక్షుడైతే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకేంటి.? వాళ్ళెందుకు మీడియాకెక్కి ఇంతలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు.? వాళ్ళకే తెలియాలి. అసలు పరిశ్రమ పెద్దలెవరూ పరిశ్రమకు ఎన్నికల వల్ల జరుగుతున్న నష్టంపై మాట్లాడకపోవడమే శోచనీయం.