Lockdown: కర్నాటక ఇప్పటికే సంపూర్ణ ‘లాక్ డౌన్’ ప్రకటించేసింది. ఢిల్లీలోనూ దాదాపు ఇదే పరిస్థితి. మహారాష్ట్రలోనూ కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. తమిళనాడు సహా పలు రాష్ట్రాలు మినీ లాక్ డౌన్.. అంటూ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనూ క్రమంగా ఆంక్షలు పెరుగుతున్నాయి. ఇదంతా కరోనా తీవ్రత నేపథ్యంలోనే. ‘లాక్ డౌన్’కి అవకాశమే లేదు.. అని చెప్పిన ముఖ్యమంత్రులే, లాక్ డౌన్ దిశగా తమ రాష్ట్రాల్ని నడిపిస్తున్నారు. మరోపక్క, ‘లాక్ డౌన్’ అనేది చివరి అస్త్రమనీ, ఆ అవకాశం రాకుండా చూడాలని ప్రజలను కోరారు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే.
అయితే, దేశంలో కరోనా పరిస్థితులు మరింతగా విషమిస్తున్నాయి. మే 14 నుంచి 18వ తేదీ లోపు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతాయనీ, అదే పీక్ స్టేజ్ అవుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 2 తర్వాత లాక్ డౌన్ దేశంలో అమల్లోకి రావొచ్చన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2వ తేదీన వెల్లడి కానుండగా, ఆ మరుసటి రోజు నుంచే లాక్ డౌన్ అమల్లోకి వస్తుందనే ప్రచారం చాలా జోరుగా వినిపిస్తోంది.
అయితే, ఈ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొట్టి పారేస్తున్నారు. ప్రస్తుతానికి సంపూర్ణ లాక్ డౌన్ ఆలోచన లేదనీ, రాష్ట్రాలు తమ పరిధిలో లాక్ డౌన్ తరహా ఆంక్షల విషయమై నిర్ణయం తీసుకోవచ్చని గతంలోనే చెప్పామని కేంద్రం అంటోంది. పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, అందుబాటులో లేని ఆక్సిజన్, మందులు, ఆసుపత్రుల్లో పడకల సమస్య.. ఇన్ని కారణాల నడుమ లాక్ డౌన్ తప్ప ఇంకో ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
నిజానికి ఇప్పుడు లాక్ డౌన్ అమల్లో లేకపోయినా, స్వచ్ఛందంగా చాలా చోట్ల ప్రజలే లాక్ డౌన్ తరహాలో స్వీయ నిబంధనలు విధించుకుంటున్నారు. ఏం చేసినా, కరోనా అదుపులోకి రాకపోవడానికి కారణాలేంటి.? అన్నదానిపై నిపుణులు సైతం ఏమీ చెప్పలేని పరిస్థితి.