Lal Bagh Movie Review : ‘లాల్ బాగ్’ తెలుగు రివ్యూ! – దోషితో దౌడు తీయని మిస్టరీ!

రేటింగ్ : 1.5/5

రచన – దర్శకత్వం : ప్రశాంత్ మురళీ పద్మనాభన్

తారాగణం : మమతా మోహన్ దాస్, శిజోయ్ వర్ఘీస్, నేహా సక్సేనా, రాహుల్ దేవ్ శెట్టి, రాహుల్ మాధవ్, తదితరులు

సంగీతం : రాహుల్ రాజ్,

ఛాయాగ్రహణం : ఆంటోనీ జో

బ్యానర్ : లాల్ బాగ్ సెలెబ్రిటీ, రెడ్ కార్పెట్ ఫిలిమ్స్

నిర్మాత : రాజ్ జహరియా

విడుదల : డిసెంబర్ 18, 2021 (జీ 5)

Lal Bagh Movie Review : జీ5 లో మలయాళ మర్డర్ మిస్టరీ ‘లాల్ బాగ్’ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. లాల్ అంటే హిందీలో ఎరుపు రంగు, బాగ్ అంటే తోట. బెంగుళూరుని సిటీ ఆఫ్ గార్డెన్ అని పిలుస్తారు. లాల్ బాగ్ టైటిల్ కి ‘గార్డెన్ సిటీ ఆఫ్ సిన్స్’ అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఇది మర్డర్ మిస్టరీ గనుక హత్యతో ‘ఎర్ర బారిన తోట’ అనే అర్ధంలో ‘లాల్ బాగ్’ అని టైటిల్ పెట్టారు. బెంగుళూరు నేపథ్యంలో జరిగే ఈ కొత్త మలయాళ మర్డర్ మిస్టరీ ఎలా వుందో చూద్దాం…

బెంగుళూరులో టామ్ (శిజోయ్ వర్ఘీస్), సారా (మమతా మోహన్ దాస్) లు తమ కుమార్తె పుట్టిన రోజు వేడుక జరుపుకున్న తెల్లారి టామ్ చనిపోయి కనిపిస్తాడు. సారా కంప్లెయింట్ చేయడంతో పోలీసు అధికారి డిసిపి గణేష్ హెగ్డే (రాహుల్ దేవ్ శెట్టి) విచారణ ప్రారంభిస్తాడు. పుట్టిన రోజుకి హాజరైన ఏడుగురితో పాటు సారాని ప్రశ్నిస్తూ- ఇది హత్యా, ఆత్మహత్యా లేదా సహజ మరణమా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూంటాడు. పోస్ట్ మార్టం లో విష ప్రయోగం జరిగినట్టు తేలుతుంది. దీంతో సహజ మరణం అనుమానం తొలగిపోయి ఈ విష ప్రయోగం హత్యా, ఆత్మ హత్యా అన్న కోణం లో విచారణ దిశ మారుస్తాడు. విచారణలో విస్మయం కల్గించే నిజాలు బయటపడుతూంటాయి.

ప్రధాన అనుమానితుల్లో టామ్ స్నేహితులు, సహోద్యోగులతో బాటు భార్య సారా కూడా వుంటుంది. సారా రాసుకున్న డైరీలో టామ్ తో అంత మంచి సంబంధాలు లేవని వెల్లడవుతుంది. డిసిపి హెగ్డే విచార కొనసాగిస్తూ పోతూంటే చివరికి దోషి ఎవరో నిర్ధారణ అవుతుంది. ఎవరా దోషి? ఎందుకు, ఎలా టామ్ ని చంపాల్సి వచ్చింది? ఇది చిట్ట చివర్లో మనకు తెలుస్తుంది.

చివరికి తేలే మర్డర్ మిస్టరీ అంటే ఎండ్ సస్పెన్సే అయుంటుంది. ఇది ఎండ్ సస్పెన్స్ కథే. అందువల్ల థ్రిల్ వుండదు. సస్పెన్స్ మొదటి నుంచీ వుంటుంది. ఈ సస్పెన్స్ తేలేవరకూ చివరి వరకూ వేచి వ్వుండాలి. అంతవరకూ ప్రశ్నలు జవాబుల విచారణ థ్రిల్ లేకుండా, యాక్షన్ లేకుండా సాగే డైలాగులతో నడిచే కథనాన్ని ఓపిగ్గా చూస్తూ వుండాలి. దోషి ఎవరో ఇంటర్వెల్ కైనా ఆడియెన్స్ కి రివీల్ చేసేసి, ఆ దోషిని పోలీసులు ఎలా పట్టుకుంటారన్న యాక్షన్ తో థ్రిల్ తో నడిపి వుంటే ఎండ్ సస్పెన్స్ తో కలిగే విసుగు తొలగిపోయి ఇంట్రెస్టింగ్ గేమ్ ని ఎంజాయ్ చేసే వాళ్ళం.

బోలెడు అనుమానితులున్నారు. వాళ్ళని అనుమానించడానికి తగిన బలమైన మోటివ్స్ లేకుండా ఫ్లాట్ గా ఈ కథ వుంటుంది. ఫ్లాట్ గా వున్న కథలో లోపాన్ని కవర్ చేయడాని కన్నట్టు మధ్య మధ్యలో సారా -టామ్ ల జీవితం గురించి ఫ్లాష్ బ్యాక్స్ చూపిస్తూ పోయారు. చిట్ట చివరికి దోషిని రివీల్ చేసినప్పుడు అదైనా షాకింగ్ గా వుండదు. అదీ ఫ్లాట్ గా తేలిపోయింది.

సారా నర్సు అన్నప్పుడు, డైరీలో భర్తతో సంబంధాలు సరిగా లేవని తెలిసినప్పుడు రెండు సందేహాలు వస్తాయి. భర్తతో సంబంధాలు సరిగా లేవని డైరీలో రాసుకుంటూ ఆ డైరీని భర్తకి కనబడేట్టు టేబుల్ పైనే పెడుతుందా? డిసిపి ఈ ప్రశ్న వేసి వుంటే ప్రధాన నిందితురాలు తనే అవుతుంది. పైగా తను నర్సు. పాయిజన్స్ గురించి తనకే ఎక్కువ తెలిసి వుండాలి. మోటివ్ కోసం డైరీలో రాసుకున్న విషయాలే సాక్ష్యంగా వున్నాయి. అసలు భర్త సెల్ ఫోన్ ని సీజ్ చేసి చెక్ చేసి వుంటే మిస్టరీ ఎప్పుడో వీడిపోయేది.

సారాగా మమతా మోహన్ దాస్ నీటైన ప్రదర్శనని ప్రదర్శించింది. క్యారక్టర్ డెప్త్ ఆమె పాత్రకే వుంది. ఇతర అనుమానిత పాత్రలకి ఇలాటి కథకి అవసరమైన డెప్త్, షేడ్స్ లేకపోవడంతో వాళ్ళు అనుమానితులుగానే కనిపించరు ఒక్క డిసిపికి తప్ప. భర్త పాత్రలో శిజోయ్ వర్ఘీస్ కూడా నీటుగానే నటించాడు. పాత్రలన్నీ నీటుగానే కన్పిస్తాయి డిసిపిగా రాహుల్ దేవ్ శెట్టితో బాటు. నీటుగా వుండే మనుషులు నగర అలవాట్లతో బయటపడకుండా ఎలాటి పనులు చేస్తారో చెప్పడం దర్శకుడి ఉద్దేశం కావచ్చు. కానీ కథ లోతుల్లోకి వెళ్ళకుండా బలహీన పాత్రచిత్రణలు చేయడంతో మిస్టరీ కూడా నిలబడలేక పోయింది.

విజువల్ క్వాలిటీ ప్రత్యేకాకర్షణగా మాత్రం వుంది. బెంగుళూరు సిటీ నైట్ సీన్స్ కళాత్మకంగా వున్నాయి. ఇండోర్స్ లో ఎక్కువ సాగే సీన్స్ కి కూడా కెమెరామాన్ ఆంటోనీ జో స్టయిలిష్ లుక్ తెచ్చాడు. అలాగే రాహుల్ రాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు విజువల్స్ కి చైతన్యాన్ని నింపింది. కానీ ఇలాటి కంటెంట్ తో ఏం లాభం. కాలం చెల్లిన మర్డర్ మిస్టరీ కథలతో ఇంకా సినిమాలు తీయడం దర్శకుల కదో ఆనందం!

—సికిందర్

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles