మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం క్రితం ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, రాజకీయాల్లోకి వచ్చిన విషయం విదితమే. కానీ, ఆయన రాజకీయాల్లో ఎక్కువ కాలం వుండలేకపోయారు. చిరంజీవి వెంట రాజకీయంగా నడిచిన సినీ ప్రముఖుల్లో కృష్ణంరాజు గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి.
‘చిరంజీవి కోసం నేనొచ్చాను..’ అంటూ గర్వంగా చెప్పుకున్నారు ప్రభాస్ అప్పట్లో చిరంజీవికీ, కృష్ణంరాజుకీ మధ్య అంతటి అనుబంధం వుండేది. ‘మేమిద్దరం అన్నదమ్ములం..’ అని పలు సందర్భాల్లో కృష్ణంరాజు చెప్పారు.. అలా కృష్ణంరాజు చెప్పడాన్ని ఎంతో ఎమోషనల్‌గా చిరంజీవి కూడా ఫీలయ్యేవారు. కెరీర్ తొలి నాళ్ళలో తనను కృష్ణంరాజు ప్రోత్సహించారని చిరంజీవి చెప్పడం చూశాం.
రాజకీయాల్లోనూ చిరంజీవికి అండగా వుండాలనుకున్నారు కృష్ణంరాజు. అయితే, అనివార్య కారణాల వల్ల నర్సాపురం కాకుండా రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున కృష్ణంరాజు పోటీ చేయాల్సి వచ్చింది. అది కృష్ణంరాజుకి ఇష్టం లేదంటూ అప్పట్లో పెద్ద రచ్చ చేశారు కొందరు.
కానీ, చిరంజీవి కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని అప్పట్లో కృష్ణంరాజు స్వయంగా చెప్పారు. ‘మంచిని గెలిపించలేకపోయారు..’ అంటూ ప్రజారాజ్యం నుంచి తన ఓటమిపై కృష్ణంరాజు అప్పట్లో కొంత ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి ద్వారా రాజకీయాల్లో మార్పు వస్తుందని కృష్ణంరాజు బలంగా నమ్మారు. కానీ, ప్రజలు ఆ మార్పుకి పట్టం కట్టలేపోయారన్నది నిర్వివాదాంశం.
‘ఈ రాజకీయాల్లో ముందడుగు వేయడం కష్టం..’ అని ఆ తర్వాత స్వయంగా కృష్ణంరాజే చిరంజీవితో ఓ సందర్భంలో అన్నారట. అలా కృష్ణంరాజు చెప్పిన మాట చిరంజీవిలోనూ బలంగా నాటుకుపోయిందనీ, అందుకే ఆయన ఇంకోసారి రాజకీయాల గురించి ఆలోచించలేదనీ అంటుంటారు.