‎Krishna Leela Movie: కృష్ణ లీల మూవీ రివ్యూ.. సినిమా హిట్టా,పట్టా?

Krishna Leela Movie: ఇటీవల కాలంలో విడుదల అయిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. మంచి కంటెంట్ తో వస్తున్న ప్రతి సినిమా కూడా పెద్ద సినిమా రేంజ్ లో హిట్ అవుతున్నాయి. అలా ఈ వారం మంచి కంటెంట్‌తో వచ్చిన సినిమా కృష్ణలీల కూడా మంచి హిట్ ని అందుకుంది. తిరిగొచ్చిన కాలం అనే ట్యాగ్‌లైన్‌ తో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమాకు దేవన్ హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించారు. ధన్య బాలకృష్ణన్ ఇందులో హీరోయిన్‌ గా నటించింది. బేబి వైష్ణవీ సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్‌ పై జ్యోత్స్న ఈ సినిమాను నిర్మించారు. థియేటర్‌లో భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది. కథ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే..

‎కథ :

‎అమెరికాలో టాప్ యోగా గురువుగా ఉన్న విహారి (దేవన్) తన చెల్లి పెళ్లి కోసం ఇండియాకు వస్తాడు. అక్కడ హోమ్ మినిస్టర్ కూతురు బృంద (ధన్య బాలకృష్ణన్)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. కానీ బృందకు అబ్బాయిలంటే అస్సలు నచ్చదు. విహారి ఆమెను ప్రేమించాలని ప్రయత్నించిన ప్రతిసారీ రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రొటీన్ ప్రేమ ప్రయత్నాల మధ్యే, బృందను చూసినప్పటి నుంచి విహారికి గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు రావడం మొదలవుతుంది. ఈ జన్మలో తన ప్రేమను సాధించుకోవడానికి హీరో పడే తపన ఈ సినిమా అస్సలు కథ. మరి హీరో ప్రేమను హీరోయిన్ యాక్సెప్ట్ చేసిందా? లేదా? చివరికి ఏమి జరిగింది? లాంటి విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

‎విశ్లేషణ:

‎గత జన్మల ప్రేమ అనే అంశంపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినప్పటికి దానికి దైవత్వాన్ని జోడించి కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కథ మొత్తం ప్రధానంగా రెండు భాగాలుగా సాగుతుంది. మొదటి భాగంలో హీరో, హీరోయిన్ పాత్రల పరిచయాలు, విహారి బృంద కోసం తిరగడం, రొటీన్ ప్రేమ ప్రయత్నాలతో పాటు పోలీస్ స్టేషన్ సన్నివేశాలతో సాగుతుంది. కాలేజీలో ధన్య బాలకృష్ణన్ సన్నివేశాలు మరీ ఓవర్ గా అనిపిస్తాయి. బృంద తండ్రి (వినోద్ కుమార్) పెళ్లి ప్రస్తావనను అవమానకరంగా తిరస్కరించడంతో, విహారి ఆవేశంతో పోలీస్ స్టేషన్ వెళ్లి హోమ్ మినిస్టర్ కూతుర్ని చంపేశాను అని చెబుతాడు. పోలీసులు విచారించగా, బృంద బతికే ఉంటుంది. విహారి తాను గత జన్మలో చంపాను అని చెప్పడంతో కథనం ఊహించని మలుపు తిరుగుతుంది. రెండో భాగంలో గత జన్మకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్‌ పై దృష్టి సారిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌ ను పూర్తిగా చూపించకుండా క్లైమాక్స్ వరకు దాచడం ప్రేక్షకులలో కొంత ఆసక్తిని పెంచుతుంది. గత జన్మ ప్రేమకథ రొటీనే అయినా పాత్రల చిత్రీకరణ కొత్తగా ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్ అయ్యాక, బృందకి ప్రపోజ్ చేయాలి. అందుకు ఆమె నన్ను కలిసేలా చేయాలి అని విహారి కోర్టుకు పిటిషన్ వేయడం వంటి కొన్ని సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి.

‎నటీనటులు పనితీరు :

‎దేవన్ హీరోగా, దర్శకుడిగా రెండు బాధ్యతలు తీసుకొని బాగా సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. నటుడిగా కూడా మెప్పించాడు. హీరోయిన్ ధన్య బాలకృష్ణన్ మోడ్రన్ గర్ల్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లోని గ్రామీణ యువతిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రల్లోని తేడాలను చక్కగా పలికించింది. సీనియర్ నటుడు వినోద్ కుమార్ హోమ్ మినిస్టర్ పాత్రలో బలమైన నెగెటివ్ రోల్‌ను సమర్థవంతంగా పోషించారని చెప్పాలి. మిగిలిన నటినటులు ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించి మెప్పించారు.

‎సాంకేతికత :

‎దర్శకుడు దేవన్ పాత కథాంశమైనా దానికి భక్తిపూర్వకమైన స్పర్శను జోడించి కొత్తగా చెప్పాలనే సాహసోపేతమైన ప్రయత్నం చేసారు. అలాగే ఫ్లాష్‌బ్యాక్‌ లోని పీరియడ్ సెట్టింగ్స్ కోసం ఆర్ట్ డిపార్ట్‌మెంట్ మంచి కృషి చేసింది. భీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం అస్సలు సెట్ అవ్వలేదని చెప్పాలి. కాస్త పాత మ్యూజిక్ ఇచ్చినట్టు అనిపించింది. పాటలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదు. ఎడిటింగ్‌ లో చాలా సీన్స్ షార్ప్ కట్ చేసి, సాగదీతను తగ్గించాల్సింది. గ్రాఫిక్స్ విషయంలో ఇంకొంత కేర్ తీసుకుని బాగుండేది.

‎రేటింగ్: 3/5