మంత్రి కొడాలి నాని, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకష్ణ(బాలయ్య) మీద విమర్శలు చేసే క్రమంలో కొంత సంయమనం పాటిస్తుంటారు. ఎందుకు.? అంటే, దానికి చాలా కారణాలుంటాయనే చర్చ గుడివాడ నియోజకవర్గంలో తరచూ జరుగుతుంటుంది. ప్రధానంగా ఓ సామాజిక వర్గం ఓటు బ్యాంకుపై కొడాలి నాని బేస్ అయి వున్నారు గుడివాడలో.. అన్నది అక్కడ బాగా వినిపించే మాట. సరే, ఒక్క సామాజిక వర్గం ఓటేస్తేనే ఆయన ఎమ్మెల్యే అయిపోయాడా.? అన్నది ఇంకో ప్రశ్న. తాజాగా నందమూరి బాలకృష్ణ మీద కొడాలి నాని సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. ‘ఆటలో అరటిపండు’గా అభివర్ణించారు కొడాలి నాని, బాలయ్యని. ‘సినిమా షూటింగుల కోసం విదేశాల్లో, పొరుగు రాష్ట్రాలతో తిరుగుతారు గనుక, రాష్ట్రంలో పరిస్థితులు బాలయ్యకు తెలియవు, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టుని చదువుతాడు..’ అని ఎద్దేవా చేశారు మంత్రి కొడాలి. అదే సమయంలో, టీడీపీ అధినేత చంద్రబాబుని ఉద్దేశించి ‘నీఛుడు, నికృష్టుడు..’ అంటూ తనదైన స్టయిల్లో కొడాలి నాని విరుచుకుపడిపోవడం గమనార్హం.
కొన్నాళ్ళ క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా కొడాలి నాని మాటలు తూలేశారు. అందుకు తగిన మూల్యం కూడా చెల్లించుకున్నారు.. పంచాయితీ ఎన్నికల వేళ మంత్రిగారు. పవన్‌ని విమర్శించి, చంద్రబాబుని విమర్శించి.. బాలయ్య వచ్చేసరికి ఎందుకు కొడాలి మెత్తబడుతున్నారట.? ఈ విషయమై వైసీపీ వర్గాల్లోనూ కొంత అసహనం వుంది. కానీ, కొడాలి నాని మాత్రం బాలయ్య విషయంలో హద్దులు దాటలేరు. ఎందుకంటే, బాలయ్య దగ్గర కొడాలి నానికి సంబంధించి ఏదో ‘గుట్టు’ వుంది.. అన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న గాసిప్. అది నిజమేనా.? లేదంటే, టీడీపీ మద్దతుదారులు క్రియేట్ చేసిన కట్టు కథేనా.? ఏమో మరి.. నిజమేంటో అటు బాలయ్యకీ, ఇటు కొడాలి నానికే తెలియాలి.