టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే 2014 నుంచి గతంలో ఏనాడు కూడా ఇంత తీవ్ర స్థాయిలో పార్టీపై, ప్రభుత్వంపై వ్యతిరేకత రాలేదు. కానీ.. దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో మాత్రం టీఆర్ఎస్ పార్టీపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉన్నదా? ఓవైపు కరోనా వస్తే పట్టించుకోరు… భారీ వర్షాలు, వరదలు వస్తే పట్టించుకోరు.. జనాలు బతకాలా? చావాలా? ప్రభుత్వమే ప్రజలను పట్టించుకోనప్పుడు ఏం చేయాలి? అంటూ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీపై విపరీతంగా ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే.
ఇది వేరే పార్టీలకు బాగా కలిసి వస్తోంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెచ్చిపోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీపై ఈ విషయాలపై ఆరోపణలు చేస్తూ.. దుబ్బాక గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
అయితే.. టీఆర్ఎస్ నేతలు మాత్రం దుబ్బాకలో ఎప్పుడో గెలుపు ఖాయం అయిపోయింది. అక్కడ టీఆర్ఎస్ గెలవడం పక్కా అంటున్నారు. రెండో స్థానం కోసమే ఈ పోటీ. రెండో స్థానంలో బీజేపీ ఉండాలా? లేక కాంగ్రెస్ ఉండాలా? అనే దానికోసమే కొట్టుకుంటున్నారు.. అంటూ టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నా… బీజేపీ మాత్రం బాగా దూకుడు మీదున్నది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అయితే టీఆర్ఎస్ పార్టీపై, ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దుబ్బాక ప్రజల్లో చైతన్యం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకను నిర్లక్ష్యం చేసిన విషయం అందరూ చూశారు. దుబ్బాకలో పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరు దుబ్బాక ప్రజల గొంతుక అవుతారో వాళ్లనే గెలిపించండి.. అంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక ప్రజలను కిషన్ రెడ్డి కోరారు.
బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రఘునందన్ రావు.. గెలిచినా.. ఓడినా మీ కష్టసుఖాల్లోనే ఉంటారు.. ఉంటున్నారు. ఆయన్ను గెలిపిస్తే దుబ్బాక అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తారు. దుబ్బాక ఆత్మగౌరవం నిలబడాలంటే ఖచ్చితంగా రఘునందన్ రావును గెలిపించాలి.. అంటూ కిషన్ రెడ్డి ఓవైపు టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూనే.. రఘునందన్ రావును గెలిపించాలని కోరారు.