Nagababu: తన సోదరుడు పవన్ కళ్యాణ్ మీద మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘కింగ్ (రాజు) కంటే, హీరో గొప్ప..’ అని సెలవిచ్చారు నాగబాబు. ‘కింగ్ కంటే గొప్పగా హీరోని ఎలా మార్చగలదు.? తన పాలన, తన రాజ్యం కోసమే రాజు పోరాడతాడు.. కానీ, నువ్వు.. ఓ హీరోవి.. అందరి కోసం పోరాడతాడు..’ అంటూ తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి నాగబాబు ట్వీటేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అయ్యింది.
అయితే, జనసేన పార్టీ విషయంలోనూ, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీదా చాలా ఆరోపణలున్నాయి. జనసేన అనే పార్టీ దశ, దిశ లేకుండా వెళుతోందని. జనసేన కోసం నిబద్ధతతో పనిచేసే అభిమానులు (జనసైనికులు) వున్నారు. వాళ్ళలోనే కొందరు నాయకులుగా ఎదిగారు. గ్రామ స్థాయిలో ప్రజలకు అండగా పలు సందర్భాల్లో నిలుస్తున్నారు. జనసైనికుల్ని అస్సలెక్కడా తప్పు పట్టడానికి వీల్లేదు.
ఇప్పుడున్న రాజకీయాల్లో, ఓ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలుండడం జనసేన పార్టీ గొప్పతనమే. కానీ, నాయకులేం చేస్తున్నారు.? అధినాయకుడు ఏం చేస్తున్నాడు.? అన్నదే కీలకం. పవన్ కళ్యాణ్ తన వరకూ సమస్యల మీద పోరాటం చేస్తున్న మాట వాస్తవం. అందుకే, ఏదన్నా సమస్యతో ప్రజలు కొట్టుమిట్టాడుతోంటే, వాళ్ళకి ముందుగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు.. ఆయనే తమ సమస్యకు పరిష్కారం చూపుతారని భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కూడా తనవంతుగా ఆ సమస్య పట్ల పోరాడుతున్నారు. కానీ, ఏం లాభం.? ఇప్పుడున్న రాజకీయాల్లో రాజకీయ పార్టీని, రాజకీయంగా అత్యంత బాధ్యతతో మాత్రమే కాదు, అత్యంత వ్యూహాత్మకంగా కూడా నడిపించాలి. టీడీపీతో పొత్తు, బీజేపీతో పొత్తు.. టీడీపీతో తెగతెంపులు, బీజేపీతో తెగతెంపులు, బీజేపీతో మళ్ళీ పొత్తు.. మధ్యలో వామపక్షాలు, బీఎస్పీతో స్నేహం.. ఇలా చాలా కథ నడిచింది నడుస్తూనే వుంది. ఇదా రాజకీయం.? ఇదా వ్యూహం.? ఇక్కడే, నాయకుడిగా పవన్ ఫెయిల్ అవుతున్నారు.
రాజకీయాల్లో హీరోయిజం చూపించాలంటే, నిబద్ధతతో పనిచేయాలి. అది పవన్ కళ్యాణ్ నుంచి ఆశించలేం.. అన్నది చాలామంది అభిప్రాయం.