Eatala Rajender: న్యాయవాది వామన్ రావు, ఆయన సతీమణి కొన్ని నెలల క్రితం దారుణ హత్యకు గురవడం తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాజకీయాల్ని ఓ కుదుపు కుదిపేసింది ఈ జంట హత్యల ఉదంతం. అత్యంత కిరాతకంగా, న్యాయవాద దంపతుల్ని నిందితులు హత్య చేశారు. ఎందుకు ఈ హత్య జరిగింది.? ఈ హత్య వెనుక రాజకీయ ప్రమేయమేంటి.? అన్న దానిపై భిన్న వాదనలు వినిపించాయి.
అధికార పార్టీకి చెందిన నేత ఒకరి హస్తం వుందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ‘అంతా తూచ్..’ అనేసింది అప్పట్లో అధికార పార్టీ. ఇప్పుడు అదే అధికార పార్టీ, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పేరుని ఈ వ్యవహారంలోకి లాగుతోంది. ఇటీవలే మంత్రి పదవి కోల్పోయిన ఈటెల రాజేందర్, నిందితుల్లో ఒకరిగా చెప్పబడుతోన్న పుట్టా మధుతో బంధుత్వం కలిగి వున్నారనీ, వామన్ రావు హత్య కేసులో ఈటెలకూ పాత్ర వుండి వుండొచ్చనీ గులాబీ శ్రేణులు లీకులు పంపుతున్నాయి.
మొన్నటిదాకా ఈటెల రాజేందర్ మిస్టర్ క్లీన్ పర్సన్. కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. గతంలో వామన్ రావు హత్య జరిగిన సమయంలో.. అసలు ఈటెల పేరు ఎక్కడా వినిపించలేదు. కానీ, ఇప్పుడు మీడియా కథనాల్లో ఈటెల పేరు చుట్టూ పెద్ద రచ్చ జరుగుతోంది. రాజకీయాలంటేనే ఇంత.. అనుకోవాలేమో. మరోపక్క, తాజా పరిణామాల్ని ఈటెల శిబిరం అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తోందట.. విశ్లేషిస్తోందట.
భూ కబ్జా ఆరోపణల వ్యవహారం బెడిసికొట్టేసరికి, ఎలాగోలా ఈటెలను ఇరకాటంలో పడేయడానికి అధికార పార్టీ చూస్తోందన్నది వారి వాదన. ఒక్కటి మాత్రం నిజం.. ఎంతటి తీవ్రమైన గొడవలున్నా, వామన్ రావు అలాగే ఆయన భార్యను (ఇద్దరూ న్యాయవాదులే) అతి కిరాతకంగా చంపేయడం అత్యంత హేయం. ఈ ఘటన వెనుక ఎవరు బాధ్యులైనాసరే.. కఠినంగా శిక్షించాల్సిందే. అంతే తప్ప, ఇదొక రాజకీయ వ్యవహారంలా మారిపోకూడదు.