లేటెస్టుగా రేసులోకి దూసుకొచ్చిన ‘రాజా విక్రమార్క’

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న కుర్ర హీరో కార్తికేయ. కేవలం హీరోగానే కాకుండా, విలన్‌గా కూడా తన సత్తా చాటుతున్నాడీ ఎనర్జిటిక్ కుర్రాడు. నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్ పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న కార్తికేయ, ‘చావు కబురు చల్లగా’ అంటూ కరోనా టైమ్‌లోనూ ప్రేక్షకుల్ని పలకరించాడు.

ఇక లేటెస్టుగా తమిళంలోనూ అదృష్టం పరీక్షించిుకున్నాడు. అజిత్ హీరోగా తెరకెక్కిన ‘వాలిమై’ చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ పోషించాడు కార్తికేయ. ఇక అసలు విషయానికి వస్తే, కార్తికేయ తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీ సారిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ఓ పవర్ ఫుల్ లుక్ వదిలింది చిత్ర యూనిట్.

గతంలోనే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. డిఫరెంట్ వేరియేషన్‌లో కార్తికేయ కనిపించాడు ఆ లుక్‌లో. కాగా, ‘రాజా విక్రమార్క’ను దీపావళి సీజన్‌ని క్యాష్ చేసుకునేలా నవంబర్ 12న రిలీజ్ చేయబోతున్నామంటూ అధికారికంగా రిలీజ్ డేట్ కన్ఫామ్ చేశారు మేకర్లు.

అదీ సంగతి. దీపావళి రేస్‌లో ఏ ఏ సినిమాలున్నా భయపడేది లేదమ్మా.. అంటూ చేతిలో గన్ పట్టుకుని, మరీ ప్రామిసింగ్ లుక్స్‌తో పవర్ చూపిస్తున్నట్లుంది కార్తికేయ తాజా లుక్. కావాలంటే, ఆ లుక్‌పై మీరూ ఓ లుక్కేసుకోవచ్చు.