నందమూరి హీరో నయా మూవీస్….ప్లానింగ్ అదుర్స్

Kalyan ram new movies updates

నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు (జూలై 5) సందర్బంగా ఆయన చేయబోయే తదుపరి సినిమాల గురించి ప్రకటనలు రావటంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదని తెలుస్తుంది. వాస్తవానికి కళ్యాణ్ రామ్ కు ఉన్న సత్తాకి తెలుగు చిత్ర పరిశ్రమలో మరింత ఉన్నత స్థాయిలో ఉండాలి. తాజా పరిస్థితులు చూస్తుంటే ఆ లోటు కూడా తీరిపోయేలా ఉందని అనుకోవచ్చు. నందమూరి హీరో మొత్తం ఐదు సినిమాలను లైన్ లో పెట్టి కెరీర్ లో ఎన్నడూ లేనంత ఫుల్ జోష్ లో ఉన్నాడు. అన్ని ప్రాజెక్ట్స్ కూడా చాలా ఆసక్తికర కాంబినేషన్ లో ఉండడంతో ఇప్పుడే వీటిపై క్రేజ్ ఏర్పడింది.

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ‘బింబిసార’ అనే హిస్టారికల్ సినిమాను సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో చేస్తున్నారు. కళ్యాణ్ కెరీర్ లో 18వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే చాలావరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా పుట్టిన రోజు కానుకగా బింబిసారా నుండి మరొక పోస్టర్ విడుదలైంది. ఇక కల్యాణ్‌ రామ్‌ 19వ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో చేయనున్నట్లు ఈ రోజు ప్రకటించారు. ఇదే కోవలో 20వ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మిస్తుండగా, 118 మూవీ డైరెక్ట్ చేసిన కేవి గుహన్ మరోసారి కళ్యాణ్ తో మరోసారి జత కడుతున్నాడు.

అలానే న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా 21వ చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్ రూపొందిస్తోంది. ఈరోజు క‌ల్యాణ్ రామ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘డెవిల్‌’ అనే పేరుతో ‘ద బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనే టాగ్ లైన్ జతచేశారు. ఇదే వరుసలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు నిర్మాణంలో కళ్యాణ్ 22వ మూవీ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటన చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర న‌టీన‌టుల, సాంకేతిక నిపుణుల వివరాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని మేకర్స్‌ తెలియ‌జేశారు.