ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ ..ఐపీఎల్. ఈ లీగ్ లో ఆడాలని ప్రతి ఒక్క ప్లేయర్ ఎన్నో కలలు కంటాడు. ఒక్కసారి ఐపీఎల్ గేట్స్ తెరచుకుంటే సీనియర్ టీం లోకి ఎంట్రీ కూడా చాలా సులువుగా దొరుకుతుంది. అలాగే కాసుల వర్షం కురుస్తుంది. తాజాగా ఐపీఎల్లో కడప జిల్లాకు చెందిన కుర్రాడికి ఛాన్స్ దొరికింది. గురువారం చెన్నైలో నిర్వహించిన వేలంలో హరిశంకరరెడ్డిని రూ.20 లక్షలకు సీఎస్కే దక్కించుకుంది.
హరిది చిన్నమండెం మండలం బోనమల సమీపంలోని నాగూరివాండ్లపల్లె. ప్రస్తుతం అతను ఆంధ్రా క్రికెటర్ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు.. బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. 2018 నుంచి ఆంధ్రా టీమ్‌కు ఆడుతున్నాడు. 2018 జనవరి 11న ఆంధ్రా-కేరళ జట్ల మధ్య విశాఖపట్నంలో జరిగిన టీ20 మ్యాచ్‌తో క్రికెట్లో అడుగు పెట్టాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లను పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన ఆయన 12 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లను తీశాడు. హరిశంకర్ రెడ్డి ఇప్పటి వరకు 13 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ముంబైలో పుదుచ్చేరి టీమ్ మీద 35 పరుగులకు మూడు వికెట్లను తీసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రాణిస్తుండటంతో ఐపీఎల్ మినీ ఆక్షన్‌లో ఎంట్రీ దక్కింది.
మరోవైపు కడప జిల్లాకే చెందిన పైడికాల్వ విజయ్ కుమార్‌కు ఐపీఎల్లో అవకాశం దక్కింది. ఆయన దక్కన్ ఛార్జర్స్‌కు ఆడారు. 2007లో బెంగాల్ టీమ్‌తో జరిగిన రంజీమ్యాచ్‌లో 10 వికెట్లను పడగొట్టిన అరుదైన రికార్డ్ విజయ్ కుమార్‌కు ఉంది. ఇప్పుడు హరిశంకర్రెడ్డికి సీఎస్కే అవకాశం కల్పించింది. హరిశంకరరెడ్డి ఐపీఎల్‌కు ఎంపిక కావడంపై తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి, లక్ష్మిదేవి, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే , దీంతో మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, ఫాప్ డుఫ్లెసిస్, శార్దుల్ ఠాకూర్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అరుదైన అవకాశం హరిశంకర్‌కి దక్కినట్టయింది.
LION ALERT! 🦁
From the land of #Bahubali we rope in Harishankar Reddy! #WhistlePodu #Yellove #SuperAuction 💛🦁— Chennai Super Kings (@ChennaiIPL) February 18, 2021