9వ వసంతంలోకి కాదంబరి ‘మనం సైతం’

ఆపన్నులకు అభయహస్తం, పేదల పెన్నిధి మనం సైతం సేవా సంస్థ 9వ వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న ఈ సామాజిక సేవా సంస్థ పేదవాడి జీవ నాడిగా నిలుస్తోంది. అపదలో ఉన్న ఎందరినో ఆదుకుంటూ ఆపన్నులను అక్కున చేర్చుకుంటోంది. 24 విభాగాల్లోని కార్మికులతో పాటు సాయం చేయమన్న ప్రతి పేదవారికీ అండగా ఉంటోంది. తిత్లీ, కేరళ తుఫాను వంటి ప్రకృతి విపత్తుల్లోనూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి వారి కోసం విరాళాలు పంపించింది. కరోనా సమయంలో ఉచిత మందులు, ఆక్సీజన్ సిలిండర్లు, నిత్యావసర వస్తువులు, పీపీఈ కిట్లు అందజేసి ఆపత్కాలంలో ఆదుకున్నారు.

అహర్నిశలు పేదలకు సేవ చేస్తున్న కాదంబరి కిరణ్ కృషిని చిత్ర పరిశ్రమ దిగ్గజాలైన సూపర్ స్టార్ కృష్ణ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, స్వర్గీయ కృష్ణంరాజు గారు…ఇలా ఎంతోమంది అభినందించారు. ఆపదలో ఉన్న పేదలకు మనం సైతం ద్వారా ఎంపీ సంతోష్ గారు, మంత్రి కేటీఆర్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ తో ఆర్థిక సాయం అందించారు.

మనం సైతం సంస్థ 9వ వార్షికోత్సవం సందర్భంగా కాదంబరి కిరణ్ స్పందిస్తూ….నా మానస పుత్రిక మనం సైతం 9వ యానివర్సరీ జరుపుకోవడం సంతోషంగా ఉంది.. ఇవాళ నా పుట్టినరోజు అనే కంటే మనం సైతం పుట్టినరోజుగా పిలవడమే ఇష్టపడతాను. పేదరికాన్ని రూపుమాపడం ఎవరివల్లా కాదు. కానీ కష్టాల్లో ఉన్న వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలి, భరోసా కలిగించాలి అనే కోరికతో ఈ సేవా సంస్థను మొదలుపెట్టాను. సేవ చేసే మనసున్న వారే నా దృష్టిలో గొప్పవారు. సాటివారికి సాయం చేసేవారికి పాదాభివందనం చేస్తా. పేదొటికి అన్యాయం చేస్తే దేవుడినైనా ఎదిరిస్తా. ఆర్థిక ఇబ్బందులతో తమకు అనారోగ్యం ఉందని చెప్పుకోలేక తమలోనే దాచుకుని ఆ వ్యాధితో చనిపోయిన వారిని నేను చూశాను. పేదవారికి జనతా హాస్పిటల్, వృద్ధాశ్రమం, ఉచిత పాఠశాల ఒకే ప్రాంగణంలో నిర్మించాలనేది నా జీవితకాల కోరిక. నేను పుట్టినరోజులు జరుపుకోవడం త్యజించాను. మనం సైతం పుట్టినరోజే నాకు ముఖ్యం. నేనున్నా లేకున్నా మనం సైతం ఉంటుంది. అన్నారు.