KA Paul: కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కె.ఎ.పాల్ కూడా లైన్‌లోకి వచ్చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే మన మీడియా ముందు కనిపించే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్. కరోనా పాండమిక్ నేపథ్యంలో కాస్త లేటుగా అయినా హడావిడి గట్టిగానే చేసేస్తున్నారు. నిజానికి, కరోనా పాండమిక్ సమయంలో ఆయన చేసే కామెడీ చాలా పెద్ద ఊరట.. అన్నది మెజార్టీ అభిప్రాయం.
అయితే, ఇది కామెడీ చేసుకునే సమయం కాదు. కానీ, ఆయన కామెడీ చేస్తూనే వుంటారు. ఈసారి కాస్త వాలీడ్ పాయింట్ తీసుకొచ్చారు కె.ఎ.పాల్. పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టును ఆశ్రయించారు కూడా పదో తరగతి విద్యార్థుల తరఫున. లక్షల సంఖ్యలో విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వుందనీ, వారితోపాటు పరీక్షా కేంద్రాలకు తల్లిదండ్రులో ఇతర సహాయకులో వస్తారనీ, ఈ క్రమంలో కరోనా వ్యాప్తి పెరిగితే, తద్వారా జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ కె.ఎ.పాల్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.
ఆఖరికి కె.ఎ.పాల్.తో కూడా చెప్పించుకునే స్థాయికి వైఎస్ జగన్, తన స్థాయిని దిగజార్చేసుకున్నారా.? అన్న చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. వాస్తవానికి, పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయమై ఎంతలా సమర్థించుకుంటున్నా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాదనను ఎవరూ విశ్వసించలేకపోతున్నారు.. ఎవరూ ఆయనకు మద్దతుగా నిలబడలేకపోతున్నారు.
ప్రభుత్వమే చెబుతోంది, కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలనీ.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని. ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదు. అలాంటిది, పరీక్షలు.. మార్కులు.. అంటూ వైఎస్ జగన్ చెబుతోంటే, విద్యార్థులు.. వారి తల్లిదండ్రులకు తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ఇదిలా వుంటే, ఈ వ్యవహారంలో కె.ఎ.పాల్ సరైన రీతిలో స్పందిస్తున్నారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. టైమ్ చూసుకున్ని కె.ఎ.పాల్ ఇచ్చిన ఎంట్రీ ఆయనకు బోల్డంత మైలేజీ పెంచుతోందని నిస్సందేహంగా చెప్పొచ్చు.