జూ.ఎన్టీఆర్ అభిమానుల్లో ఉన్న చిరకాల కోరిక ఎప్పటికైనా ఆయన టీడీలోకి వెళ్లాలని, పార్టీ పగ్గాలు చేపట్టాలని. టీడీపీలో ఉన్న చాలామంది రామారావుగారి అభిమానులు కూడ ఇదే కోరుకుంటున్నారు. కానీ అతి ముఖ్యమైన వ్యక్తి, జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ నందమూరి బాలకృష్ణ మాత్రం అందుకు సుముఖంగా లేరు. తాజాగా నిన్న తన పుట్టినరోజు సందర్భంగా ఒక టీవీ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు బాలకృష్ణ. ఆ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావడం మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడగ్గా అతను పార్టీలోకి వచ్చినా రాకపోయినా తనకేమీ బాధలేదని తేల్చి చెప్పారు.
జూ.ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే పార్టీకి ప్లస్ అవుతాడా అని ఇంటర్వ్యూయర్ అడగ్గా ముందు ప్లస్ అయి ఆతర్వాత మైనస్ అయితే. ప్లస్, ప్లస్, మైనస్, మైనస్ ప్లస్ అవుతాయి కానీ ప్లస్, మైనస్ మైనస్ అవుతాయి అంటూ పరోక్షంగా తన అభిప్రాయాన్ని బల్లగుద్దినట్టు చెప్పారు. అంతేకాదు రామారావుగారి పేరు పెట్టుకున్నాం కదా, సినిమాల్లో ఉన్నాం కదా అని రాజకీయాలు చేస్తామంటే కుదరదు. పార్టీకి పారదర్శకత ఉన్న కార్యకర్తలే లీడర్లు అవుతారు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. బాలకృష్ణ మాటల వెనుక పలు కుటుంబపరమైన కారణాలు ఉండవచ్చునేమో కానీ ఆ మాటలు మాత్రం జూ.ఎన్టీఆర్ అభిమానుల్ని తీవ్రంగా తాకాయి. సోషల్ మీడియాలో బాలకృష్ణ మాటలు పెద్ద చర్చ అయ్యాయి.