‘ప్రచారం’ కోసం జూనియర్ ఎన్టీయార్‌ని దువ్వుతోన్న బీజేపీ.!

సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అవడానికి సంబంధించి రోజుకో కొత్త ఊహాగానా తెరపైకొస్తోంది. ‘టీడీపీని చేజిక్కించుకునే ఉద్దేశ్యం ఏమైనా వుందా.?’ అని జూనియర్ ఎన్టీయార్‌ని అమిత్ షా అడిగారనీ, ఇదే విషయాన్ని టీడీపీ ‘రాజగురువు’ రామోజీరావుతోనూ అమిత్ షా చర్చించారనీ గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అబ్బే, అదేం లేదు.. ఇది రాజకీయ భేటీ కాదు.. అని అంటోంది బీజేపీ. రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు. ఇందులో డౌటేముంది.? యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో అమిత్ షా భేటీ వెనుక ఖచ్చితంగా రాజకీయం వుండే వుంటుంది. అదేంటి.? అన్నదే సస్పెన్స్.

బీజేపీ తరఫున ప్రచారం కోసం ఎన్టీయార్‌ని అమిత్ షా ఒప్పించేందుకు ప్రయత్నించారంటూ తాజాగా ఓ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. ఎన్టీయార్ ఎలా బీజేపీ తరఫున ప్రచారం చేస్తాడు.? అంటే, నేరుగా బీజేపీ తరఫున కాదట.! ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ – బీజేపీ మధ్య పొత్తు గనుక కుదిరితే, టీడీపీ తరఫున ఎన్టీయార్ ఎన్నికల ప్రచారం కోసం ఎన్టీయార్ వచ్చే అవకాశాలు ఏ మేర వున్నాయన్నది తెలుసుకోవాలనే అమిత్ షా నేరుగా రంగంలోకి దిగారన్నది సదరు గాసిప్స్ సారాంశం.

.ఇదిలా వుంటే, రాజకీయాలతో సంబంధం లేకుండా, కేంద్ర ప్రభుత్వం తరఫున.. ఏదన్నా అభివృద్ధి లేదా సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ప్రకటనలో కనిపించాల్సిందిగా యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని అమిత్ షా ఒప్పించడానికే, ఎన్టీయార్‌తో భేటీ నిర్వహించారని ఓ వాదన తెరపైకొచ్చింది.

రాజకీయాల్లో ఇలాంటివి మామూలే. ‘అబ్బే, మాకు ఆ పార్టీతో సంబంధం లేదు. ఓ ప్రభుత్వ కార్యక్రమం తరఫున ప్రచారం కోసమంటే, సామాజిక బాధ్యతతో ఆ పని చేశా..’ అని రేప్పొద్దున్న చెప్పుకోవడానికి కూడా వీలుగా వుంటుంది సినీ జనాలకి. వైఎస్ హయాంలో నాగార్జున కూడా ఇలాంటి ప్రకటనల్లో కనిపించిన సంగతి తెలిసిందే.

ఏమో, యంగ్ టైగర్‌ని ఏదో ఒకలా తమవైపుకు తిప్పుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.