సినీ రంగంలోనూ రాజకీయాలు తక్కువేమీ కాదు. రాజకీయ అనుభవం వున్న సినీ తారల్లో కొందరైతే చాలా తేలిగ్గా నాలిక మడతేసెయ్యగలరు. ‘మా’ అధ్యక్షురాలిగా బరిలోకి దిగుదామనుకున్న జీవిత, అనూహ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో చేరిపోయారు. ఆమె జనరల్ సెక్రెటరీ పదవికి పోటీ పడబోతున్నారు. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికలు సాధారణ రాజకీయ ఎన్నికల్ని మించేలా హీటెక్కించేస్తున్నాయంటే అందుక్కారణం కొందరు ‘మా’ సభ్యులు మాత్రమే. అందులో జీవిత కూడా ఒకరని నిస్సందేహంగా చెప్పొచ్చు. ‘మా’ ఎన్నికలు ఈసారి ‘మా భవనం’ చుట్టూ వాతావరణాన్ని వేడెక్కించేస్తున్నాయి. కోట్లాది రెమ్యునరేషన్ తీసుకునే నటీనటులున్న ‘మా’ కోసం సొంత భవనం ఇప్పటిదాకా ఎందుకు నిర్మించుకోలేకపోయారన్నది ఓ ప్రశ్న. ‘మేమే ఆ భవనాన్ని కట్టేస్తాం..’ అంటూ మంచు విష్ణు ముందుకొచ్చాడు. మంచి విషయమే. కానీ, ఇన్నాళ్ళూ ఎందుకు ఆ పని చేయలేకపోయాడంటూ జీవిత ప్రశ్నించడం గమనార్హం.
ఇదే మంచు విష్ణు సహకారంతో జీవిత, ప్రకాష్ రాజ్ ప్యానెల్ మీద పోటీ చేయాలనుకున్నారనే ప్రచారం జరిగింది. మంచు విష్ణుతో ఈ మేరకు ఆమె మంతనాలు జరిపారు కూడా. కానీ, ఇంతలోనే ‘టంగ్ ట్విస్టింగ్’ వ్యవహారం ఆమెనుంచి ఎలా పైకొచ్చిందట.? హేమపై కొద్ది రోజుల క్రితమే విమర్శలు చేసిన జీవిత, ఎన్నికల సమయంలో ఇవన్నీ మామూలేనని కొత్త పల్లవి అందుకుంటున్నారు. ‘వేర్వేరు ప్యానెల్స్.. అన్న భావన ఏర్పడ్డప్పుడు గెలవడం కోసం ఏవేవో విమర్శలు చేస్తాం. రాజకీయాల్లో కూడా అదే జరుగుతుంది కదా..’ అని జీవిత చెప్పుకొచ్చారు. నిజమే, 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి మీద జీవిత చేసిన రాజకీయ విమర్శలు కూడా అలాంటివే. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జీవిత అలా వ్యవహరించారని ఆమె మాటల్ని బట్టే అర్థమవుతోంది. ఇంతకీ, ‘ఇప్పటిదాకా ఎందుకు కట్టలేకపోయారు.?’ అని విష్ణుని జీవిత ప్రశ్నించిన దరిమిలా, విష్ణు నుంచి ఎలాంటి సమాధానమొస్తుందో.?