మెగాస్టార్ చిరంజీవి మీద పనిగట్టుకుని రాజకీయ విమర్శలు చేశారు జీవిత – రాజశేఖర్ దంపతులు. ఇది పాత కథ. మెగాస్టార్ చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు, ఆయన మీదకు ప్రయోగించబడిన రాజకీయ అస్త్రమే ‘జీవిత – రాజశేఖర్’. మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘బ్లడ్ బ్యాంక్ – ఐ బ్యాంక్’ మీద కూడా జీవిత – రాజశేఖర్ చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు జీవిత, ఆమె భర్త రాజశేఖర్. అదంతా గతం.. ఇప్పుడంతా హ్యాపీ.. అని జీవితగానీ, రాజశేఖర్ గానీ అంటే.. అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? రాజకీయాల్లో రాజకీయ విమర్శలు చేస్తే, అవి వెంటనే చల్లారిపోవచ్చుగాక. కానీ, చిరంజీవి జీవితం మీదనే మచ్చ వేసేందుకు ప్రయత్నించారు జీవిత, రాజశేఖర్. వాళ్ళిద్దరే కాదు, సినీ పరిశ్రమ నుంచి ఇంకొందరు కూడా చిరంజీవిపైన అడ్డగోలు విమర్శలు చేశారు. కానీ, ఆ తర్వాత ఏమయ్యింది.? వారి విమర్శలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి.
ఆ తర్వాత అందరికీ చిరంజీవి దేవుడిగా మారిపోయారు. చిరంజీవి అంటే మిస్టర్ క్లీన్.. చిరంజీవి అంటే సినీ పరిశ్రమకు పెద్ద. చిరంజీవి మారలేదు.. అప్పటికీ, ఇప్పటికీ అలానే వున్నారు. కానీ, జీవిత – రాజశేఖర్ సహా కొందరు మాత్రం మారారు. మారక తప్పలేదు. అలా మారినట్లు నటిస్తుండడాన్ని బండ్ల గణేష్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అప్పటిదాకా ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో వున్న బండ్ల గణేష్, ఎప్పుడైతే జీవిత ఆ ప్యానల్‌లోకి వచ్చారో.. ఆ వెంటనే, ప్రకాష్ రాజ్‌కి సైతం దూరమయ్యారు. తాను సొంతంగా జనరల్ సెక్రెటరీ పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల రాజకీయం. బండ్ల కోరుకుంటే, చిరంజీవి వద్దకు వెళ్ళి.. కావాల్సిన పదవిని పొందేవాడే. ఇక్కడ జీవిత అండ్ కో ‘రెండు నాల్కల ధోరణి’ని ఆయన బయటపెట్టాలనుకున్నాడు, బయటపెట్టేశాడు. ‘అది ముగిసిన గొడవ’ అని జీవిత వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందంటే, అప్పడామె ఎంత తప్పు చేశారో అర్థమవుతుంది.