కోవిడ్ దెబ్బతో థియేటర్ బిజినెస్ పూర్తిగా పడిపోయింది. ఓటీటీల హవా ఊపందుకుంది. పెద్ద సినిమాలకే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చూస్తారనే నమ్మకం కరువైంది. చిన్న సినిమాల సంగతి అంతే అనుకున్నారు అందరూ. కానీ ‘జాతిరత్నాలు’ చిత్రం ఈ మాటలన్నింటినీ పటాపంచలు చేసేసింది. సినిమా చిన్నదైనా పెద్దదైనా బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారని ప్రూవ్ చేసింది. గత గురువారం విడుదలైన ‘జాతిరత్నాలు’ చిత్రం ఫస్ట్ మార్నింగ్ షో ద్వారానే హిట్ టాక్ తెచ్చుకుని వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
తొలిరోజు 4 కోట్ల షేర్ రాబట్టి రెండవ రోజు 3 కోట్ల వరకు ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం నాలుగు రోజుల వారాంతాన్ని పూర్తిగా క్యాష్ చేసుకుంది. అమెరికాలో సైతం హాఫ్ మిలియన్ డాలర్లను వసూలు చేసి సూపర్ హిట్ దిశగా సాగిపోతోంది. ట్రేడ్ వర్గాల అంచనా మేరకు నాలుగు రోజుల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తుందని, అలాగే గ్రాస్ 30 కోట్లు తెచ్చుకుంటుందని తెలుస్తోంది. కేవలం 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ సినిమా 11 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటికే 11 కోట్లు రికవర్ కాగా ఇకపై వచ్చేదంతా లాభమే. సినిమా హక్కుల్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. చిన్న సినిమాగా వచ్చినా పెద్ద ఫలితాన్నే అందుకుంది ‘జాతిరత్నాలు’.