‘ఇకపై సినిమాలు చేయను, పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తాను..’ అని గతంలో ప్రకటించిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్, అనూహ్యంగా మళ్ళీ సినిమాల్లో నటించాలనే నిర్ణయం తీసుకోవడం, ఈ క్రమంలో జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ రాజీనామా చేయడం తెలిసిన విషయమే. అయితే, తాను తిరిగి సినిమాలు చేస్తోన్నది, జనసేన పార్టీకి ఆర్థికపరమైన శక్తి అందించడానికేనని పవన్ కళ్యాణ్ గతంలోనే స్పష్టతనిచ్చారు.
తాజాగా ఇంకోసారి ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారాయన. కొన్ని నెలల విరామం తర్వాత, మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్ళిన జనసేన అధినేత, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. జనసేన పార్టీ కార్యకర్తల కోసం కోటి రూపాయలు వ్యక్తిగత సంపాదన నుంచి కేటాయించి, ఇన్స్యూరెన్స్ చేయించడం జరిగిందని చెప్పారు పవన్ కళ్యాణ్.
ఈ విషయంలో పవన్ కళ్యాణ్‌ని ఎవరైనా అభినందించాల్సిందే. ఎంత పెద్ద రాజకీయ పార్టీ అయినాసరే, ఆ పార్టీ అధినేతలు.. అధికారికంగా వ్యక్తిగత సొమ్ముల్ని ఖర్చు చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. జనసేన పార్టీకి మాత్రం ఆ సమస్య లేదు. మామూలుగా అయితే, పార్టీ ఫండ్ నుంచి కార్యకర్తలకు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించే పార్టీలు కనిపిస్తాయి. పార్టీ కోసం కూడా అలాగే చందాల ద్వారా వచ్చే నిధుల్ని ఖర్చు చేస్తుంటారు.
కానీ, జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రధాన ఆదాయ వనరు. ఆయన సినిమాల్లో నటించడం ద్వారా మాత్రమే పార్టీకి ఆర్థిక శక్తి అందిస్తుంటారు. అభిమానులు కొంత మేర విరాళాలు అందిస్తున్నా, అవి చాలా స్వల్ప మొత్తంలోనే వుంటున్నాయి. అసలు సినిమాలే చేయనని తేల్చేసిన పవన్ కళ్యాణ్ ఒకేసారి ఐదారు సినిమాలకు కమిట్ అవడం వెనుక, పార్టీకి ఫండ్ ఆర్థిక పరిపుష్టిని అవసరమైన మేర కల్పించడం కోసమే.