పొత్తు జనంతోనే.! బీజేపీతో కాదని తేల్చేసిన జనసేన అధినేత.?

అంతేనా.? అలాగే అర్థం చేసుకోవాలా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘మా పొత్తు ప్రజలతోనే.. ఇంకెవరితోనూ పొత్తులు లేవు..’ అని తాజాగా చేసిన వ్యాఖ్యల్లో చాలా స్పష్టత కనిపించింది. సో, బీజేపీ – జనసేన మధ్య పొత్తు ముక్కలైపోయినట్లే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

వాస్తవానికి, ఇదే మాట కొద్ది రోజుల క్రితం బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా చెప్పారు. ‘మాకు పొత్తు జనంతో, వుంటే జనసేనతో..’ అని తేల్చేశారు సోము వీర్రాజు. బహుశా ఆ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ సరైన సమయం, వేదిక కోసం ఎదురు చూసి, కౌలు రైతు భరోసా యాత్రలో ఇలా స్పష్టత ఇచ్చేసినట్టున్నారు.

‘మాకు అవకాశం ఇచ్చి చూడండి. మీ జీవితాలు బాగు చేసే బాధ్యత మాది..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్నటి జనసేన కౌలు రైతు భరోసా యాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. జనసేన అధినేత పవన్ కళ్యాన్ రైట్ ట్రాక్‌లో ఇప్పుడు ప్రయాణం మొదలు పెట్టారనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో కనపిస్తోంది.

అయితే, మాట మీద నిలకడలేనితనంతో బాధపడే పవన్ కళ్యాణ్, ఈ మాట మీద ఎన్నాళ్ళు నిలబడతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ, గతంతో పోల్చితే, ఆయన మాటల్లో స్పష్టత రోజురోజుకీ పెరుగుతోంది. సరైన టార్గెట్ పెట్టుకుని ఇప్పుడాయన రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఒకవేళ పవన్ ఇదే తీరు కొనసాగిస్తే, ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్‌ని తమ మిత్రుడిగా భావిస్తున్న టీడీపీ, పవన్ మీద కౌంటర్ ఎటాక్ చేయడానికి ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుందో ఏమో.!