Janasenani : జనసేనాని భాగ్యనగర రచ్చ.! తెరవెనుక వున్నదెవరు.?

Janasenani : హైద్రాబాద్ అనాల్సిన చోట భాగ్యనగరం.. అని పేర్కొనడం నేరమా.? ఏమోగానీ, ఈ విషయమై సోషల్ మీడియాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. హైద్రాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ప్రాంతంలో సమతామూర్తి రామానుజుల విగ్రహాన్ని త్రిదండి చినజీయర్ స్వామీజీ నేతృత్వంలో ఏర్పాటు చేయగా, ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాంతాన్ని సందర్శించుకున్నారు.. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సందర్శించారు. పలువురు ప్రముఖులు సందర్శనకు వెళుతున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించుకున్న అనంతరం హైద్రాబాద్ పేరుని భాగ్యనగరంగా అభివర్ణించడమే వివాదానికి కారణమైంది. నిజానికి ఆయన హైద్రాబాద్ పేరునీ అలాగే భాగ్యనగరం అనే ప్రస్తావననీ.. రెండూ ఏకకాలంలో చేశారు. అయినాగానీ, పవన్ ప్రస్తావన వివాదాస్పదమైంది.

తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియా వేదికగా తీవ్రాతి తీవ్రమైన విమర్శలు చేశారు. బీజేపీ – జనసేన మధ్య పొత్తు సంగతి అందరికీ తెలిసిందే. పొత్తు వుందంటే, వుందన్నట్టు.. లేదేంటే లేదన్నట్టు కొనసాగుతోంది రెండు పార్టీల మధ్యా స్నేహం.

హైద్రాబాద్‌ని భాగ్యనగరంగా అభివర్ణించడంలో నేరమేమీ లేదు. చాలా సందర్బాల్లో టీఆర్ఎస్ నేతలు కూడా భాగ్యనగరమనే పిలుస్తుంటారు. భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ.. అని వుంటుంది.. భాగ్యనగరం విశ్వనగరం కాబోతోందని నాయకులు చెబుతుంటుంటారు.

అయితే, తాము అధికారంలోకి వస్తే హైద్రాబాద్ పేరుని భాగ్యనగరంగా మార్చేస్తామంటూ బీజేపీ నేతలు చెబుతుండడం వివాదాస్పదమవుతుంటుంది. అందుకేనేమో, బీజేపీ మిత్రపక్షమైన జనసేన మీద ఇప్పుడిలా ట్రోలింగ్ జరుగుతోంది. అయితే, పనిగట్టుకుని.. అర్థం పర్థం లేని వివాదాన్ని రేపుతున్నదెవరు.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.