తిరుపతి ఉప ఎన్నికని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భారతీయ జనతా పార్టీ. అసలక్కడ డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేకపోయినా, ఎట్టి పరిస్థితుల్లోనూ తామే గెలుస్తామంటూ మిత్రపక్షం జనసేనను సైతం ఒప్పించిన బీజేపీ అధినాయకత్వం, తామే బరిలోకి దిగిన విషయం విదితమే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మిత్రపక్షం బీజేపీ తరఫున ప్రచారం కూడా నిర్వహించారు. ఇక, తాజాగా జనసేన ఎన్నికల గుర్తు ‘గాజు గ్లాసు’, భారతీయ జనతా పార్టీని ఇబ్బందులకు గురిచేస్తోంది.
జనసేన లాంటి ఇంకో పార్టీకి ఆ గాజు గ్లాసుని కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయించడమే.. అసలు సమస్యకు కారణం. జనసేన పార్టీ, ఇంకా రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీగా తన ఉనికిని నిలబెట్టుకోలేకపోతోంది. రావాల్సిన స్థాయిలో ఓట్లు, సీట్లు రాకపోవడంతో, శాశ్వత ఎన్నికల గుర్తు విషయమై జనసేనకు కొన్ని ఇబ్బందులున్నాయి. అవే ఇప్పుడు మిత్రపక్షం బీజేపీకి శాపంగా మారాయి. ‘మా మిత్ర పక్షం గుర్తుని వేరే పార్టీకి ఎలా కేటాయిస్తారు.?’ అని ప్రశ్నిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది భారతీయ జనతా పార్టీ. ఈ విషయమై జనసేన కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే, నిబంధనలకు అనుగుణంగానే గాజు గ్లాసుని వేరే పార్టీకి కేటాయించాల్సి వచ్చిందన్నది కేంద్ర ఎన్నికల సంఘం వెర్షన్. పోలింగ్ దగ్గర పడుతోంది. ఈ తరుణంలో బీజేపీ – జనసేనకు అనుకూలంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వస్తుందా.? అన్నది సస్పెన్సే. మరోపక్క, బీజేపీతో జనసేన పొత్తుని ఇష్టపడని కొందరు జనసైనికులు, జనసేన మద్దతుదారులు లోలోపల సంబరపడుతున్నారు. నోటాకి ఓటేసే కంటే, గాజు గ్లాసుకి ఓటేస్తే పోలా.? బీజేపీకి మన బలమేంటో తెలిసొస్తుంది.? అన్న కోణంలో వారి ఆలోచనలు సాగుతున్నాయట. ఈ విషయం గ్రహించిన బీజేపీ, ఎలాగైనా గాజు గ్లాసుని రద్దు చేయించే పనిలో బిజీగా వుందట.