జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ.? అన్న చర్చ ఇప్పుడు జనసైనికుల్లో కూడా గట్టిగానే వినిపిస్తోంది. రోజులు గడుస్తున్నాయ్.. నెలలు కూడా గడిచిపోతున్నాయ్.. కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ తెరపై కనిపించడంలేదు. కరోనా బారిన పడ్డ తర్వాత ఆయన మీడియా ముందుకు రాలేదు. కొన్ని ప్రెస్ బులెటిన్లు విడుదల చేసి చేతులు దులుపుకుంటోంది జనసేన పార్టీ. అయితే, కింది స్థాయిలో జనసైనికులు మాత్రం చాలా చాలా కష్టపడుతున్నారు.
కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలకు సాయం చేస్తున్నారు. ఆక్సిజన్ సిలెండర్లను కరోనా బాధితులకు సమకూర్చుతున్నారు. అవసరమైన మందుల్నీ అందిస్తున్నారు. జనసైనికులు పడుతున్నంత కష్టం బహుశా రాష్ట్రంలో ఇంకే ఇతర రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలూ పడటం లేదన్నది నిర్వివాదాంశం. ఇంతలా జనసైనికులు కష్టపడుతున్నందున, జనసేన అధినేత కూడా రంగంలోకి దిగితే.. అది జనసేన పార్టీకి చాలా ఊతమిస్తుంది. అయితే, కరోనా కారణంగా జనసేనాని ఎక్కువ రోజులే ఇబ్బంది పడ్డారు.
దాంతో, ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతోందన్నది జనసేన వర్గాల వాదన. అయినాగానీ, వర్చువల్ సమావేశాల్లో పాల్గొనడం, ఆ వీడియో బైట్స్ మీడియాకి ఇవ్వడం వంటివి చేస్తే, జనసైనికుల్లోనూ ఉత్సాహం మరింత పెరుగుతుంది. పార్టీలోనూ కొత్త జోష్ వస్తుంది. ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల కంటే, సినీ వ్యవహారాలకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ చేస్తున్న, చేయబోయే సినిమాల గురించి దాదాపుగా ప్రతిరోజూ ఏదో ఒక టాపిక్ ట్రెండింగ్ అవుతూనే వుంది.