జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయడంతోనే, జనసైనికులు కింది స్థాయిలో అత్యద్భుతంగా పనిచేస్తున్నారు..’ అని జనసేన పార్టీకి చెందిన నేతలు బుకాయించాలనుకుంటే, మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికీ.. ఏమీ వుండదు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. కింది స్థాయిలో జనసైనికులు తీవ్రంగా కష్టపడుతున్నారు. వివిధ అంశాలపై పోరాడుతున్నారు.
కరోనా నేపథ్యంలో ఊరూ వాడా నిస్వార్ధంగా పనిచేసిన జనసైనికులు, తమ అధినేత రంగంలోకి దిగాలని కోరుకుంటున్నారిప్పుడు. నిజమే, రాష్ట్రంలో ఏ పార్టీకి చెందిన కార్యకర్తల్లోనూ ఈ చిత్తశుద్ధి కనిపించదు, ఒక్క జనసైనికులకు తప్ప. సినీ అభిమానులే, జనసైనికులుగా మారిన దరిమిలా, ఆ జనసైనికులు.. స్వలాభం అస్సలు చూసుకోకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారు. మరి, అధినేత ఏం చేయాలి.? తాను ముందుండి జనసైనికుల్ని నడిపించాలి. కానీ, అదే కొరవడుతోందిప్పుడు. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాలి గనుక.. ఆ పనుల్లో ఆయన బిజీగా వున్నారని అనుకోవాలేమో.
కరోనా మొదటి వేవ్, రెండో వేవ్ పవన్ కళ్యాణ్ అంచనాల్ని దెబ్బకొట్టాయి. లేకపోతే, దాదాపుగా పవన్ అనుకున్నట్టే ఆయా సినిమాల నిర్మాణాలు ఓ కొలిక్కి వచ్చాయి. దాంతో, పవన్ షెడ్యూల్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. వీలైనంత త్వరగా సినిమాలు పూర్తి చేయడం పవన్ ముందున్న ఒకే ఒక్క ఆప్షన్. ఆ తర్వాతే పవన్, జనంలోకి వచ్చే అవకాశం వుంటుంది.
కానీ, ఈలోగా జనసైనికులు అసహనానికి లోనైతే. పవన్ అందుబాటులో వుండలేకపోతున్నారు సరే.. పార్టీ ముఖ్య నేతలైనా కింది స్థాయిలో కార్యకర్తలకు అండగా వుండాలి కదా.? అధినేత లైట్ తీసుకున్నప్పుడు ఇతర ముఖ్య నేతలు మాత్రం ఏం చేయగలుగుతారు.? ఇలాగైతే జనసేన 2024 ఎన్నికల్లో పుంజుకోవడం కష్టం. అధినేత పవన్ ఇకనైనా పార్టీ వ్యవహారాలపై సీరియస్ ఫోకస్ పెట్టి తీరాల్సిందే.. జనంలోకి రావాల్సిందే.