అరరె పవన్ కళ్యాణ్ ఖండించేశారండోయ్.!

కుటుంబ సభ్యుల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తగదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద అసెంబ్లీ సాక్షిగా అభ్యంతరకర వ్యాఖ్యలు వైసీపీ శాసన సభ్యులు చేశారన్నది ప్రధాన ఆరోపణ. అయితే, తామెలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలూ చేయలేదని వైసీపీ నేతలు చెబుతున్నారనుకోండి.. అది వేరే సంగతి.

కానీ, అసెంబ్లీకి సంబంధించిన వివిధ వీడియోల్లో చంద్రబాబు సతీమణిని పరోక్షంగా దూషించినట్లే కనిపిస్తోంది వైసీపీ నేతలు కొందరు. సరే, చట్ట సభల్లో మాటల తూటాలు ఎలా పేలుతున్నాయి.? అవెంతలా దిగజారిపోతున్నాయి.? అన్నది వేరే చర్చ.

చంద్రబాబుకి సంబంధించి ఏ చిన్న విషయం జరిగినా పవన్ కళ్యాణ్ నుంచి చాలా తొందరగా ఖండన ప్రకటన వచ్చేస్తుంటుంది. ఇక్కడా అదే జరిగింది. అయితే, గతంలో పవన్ కళ్యాణ్ తల్లిని ఓ సినీ నటి దూషించిన ఘటనలో ప్రధాన దోషి తెలుగుదేశం పార్టీనే.

టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా కలిసి ఓ వివాదాస్పద నటిని, ఓ వివాదాస్పద సినీ విమర్శకుడ్నీ రంగంలోకి దించి.. పవన్ కళ్యాణ్ మీద బూతుల దాడి చేయించింది. ఇందులో ఓ వివాదాస్పద సినీ దర్శకుడి డైరెక్షన్ కూడా వుంది. తెరవెనుకాల వీళ్ళందరికీ వైసీపీ సహాయ సహకారాలున్నాయనే ఆరోపణలూ లేకపోలేదు.

ఆ సమయంలో టీడీపీపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్, ఇప్పుడు అదే చంద్రబాబు కుటుంబ సభ్యుల మీద వైసీపీ దూషణలనగానే, ఖండన ప్రకటన విడుదల చేశారు. దాంతో, జనసైనికులకు ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి