Jagapathi Babu: పుట్టిన రోజున గొప్ప నిర్ణయం తీసుకున్న జగపతిబాబు… స్ఫూర్తిగా తీసుకోవాలని వినతి!

Jagapathi Babu: మరణానంతరం నేత్రాలు, అవయవాలు, శరీరదానం చేయడ కంటే ఈ సమాజానికి చేసే మెరుగైన సేవ ఏదీ లేదని నమ్మే వాళ్లు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అలా చాలా మంది చనిపోయిన తర్వాత తమ అవయవాలను దానం చేసి ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతున్నారు. దేశంలో ఎంతో మంది ధీర్ఘ కాలిక సమస్యలతో బాధపడుతూ, అవయవ దానం కోసం ఎదురుచూస్తున్నారు. మరెంతో మంది సరైన సమయానికి ఊపిరితిత్తులు, గుండె, చర్మం, కాలేయం లాంటి అవయవాలు దొరకక మరెంతో మంది ప్రాణాలను కోల్పోతున్న సంఘటనలు చూస్తూనే ఉంటాం.

కాగా ఈ అవయవ దానంపై ప్రస్తుతం ఎన్నో ఎన్జీవోలు, ఇతర సొసైటీలు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తుండడం చెప్పుకోవాల్సిన విషయం. ఇక ప్రముఖులు కూడా ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు ముందుకొస్తున్నారు. మరెంతో మంది తమ మరణానంతరం అవయవ దానం చేస్తామని కూడా ప్రకటించారు. అలాంటి వాళ్లలో ఒకరిగా నిలిచారు ప్రముఖ నటుడు జగపతిబాబు. తన పుట్టిన రోజు ఫిబ్రవరి 12 ని సందర్భంగా స్వయంగా ఆయనే ఈ విషయాన్ని ప్రకటించారు. అభిమానులు కూడా అధిక సంఖ్యలో ముందుకొచ్చి, అవయవ దానానికి పూనుకోవాలని చెప్పడంతో, ఆయన పిలుపుమేరకు మరో 100 మంది తాము కూడా ఈ అవయవ దానం చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారని సమాచారం.

ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అవయవ దానం అవగాహన కార్యక్రమంలో నటుడు జగపతి బాబు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అయితే తన జన్మదినం సందర్భంగా సమాజానికి, పది మందికి ఉపయోగపడే విధంగా ఏదైనా మంచి పని చేయాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అందులో భాగంగానే తాను అవయవ దానం చేయాలనుకుంటున్నట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తన స్ఫూర్తితో మరింత మంది ఈ పనికి ముందుకు రావాలని, దాని వల్ల మరణానంతరం కూడా అమరులుగా ఉండిపోతారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొనగా.. ఆస్పత్రి ప్రతినిధులు జగపతిబాబును ఘనంగా సన్మానించారు.