గ‌ల్లాకి జ‌గ‌న్ షాక్..200 ఎక‌రాలు వెన‌క్కి..బాల‌య్య‌కు త‌ప్ప‌దేమో!

టీడీపీ ఎంపీ, ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గ‌ల్లా జ‌య‌దేవ్ కు జ‌గ‌న్ స‌ర్కార్ షాకిచ్చింది. చిత్తూరు జిల్లాలో జ‌య‌దేవ్ కు చెందిన అమ‌రరాజా ఇన్ ప్రాటెక్ కు గ‌తంలో కేటాయించిన భూముల్ని తిరిగి వెన‌క్కి తీసుకుంది ప్ర‌భుత్వం. దాదాపు 200 ఎక‌రాల‌కు పైగా ల్యాండ్ ను గ‌ల్లా చేతుల్లోంచి తీసుకుంది. దీనికి సంబంధించి మంగ‌ళ‌వారం ప్ర‌భుత్వం ఉత్వ‌ర్వులు కూడా జారీ చేసింది. గ‌త ప్ర‌భుత్వంతో గ‌ల్లా చేసుకున్న ఒప్పందం నిబంధ‌న‌ల ష‌ర‌త్తుల‌ను ఉల్లంఘించిన కార‌ణంగా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. పెట్టుబ‌డులు తీసుకొస్తామ‌ని ప్ర‌భుత్వానికి హామీ, అలాగే ఉపాధి క‌ల్పిస్తామ‌ని చెప్పిన మాట‌ను గాలికొదిలేయ‌డంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

2008లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వంలో ఏపీ ఇండ‌స్ర్టీయ‌ల్ ఇన్ ప్రాస్ర్ట‌క్చ‌ర్ ద్వారా అమ‌రరాజా కంపెనీకి 483 ఎక‌రాల‌ను నాటి కాంగ్రెస్ కేటాయించింది. డిజిట‌ల్ వ‌రల్డ్ కేటాయింపులో భాగంగా జ‌రిగిన ఒప్పందం ఇది. యాద‌మ‌ర్రి మండ‌లం మ‌జారా కొత్త‌ప‌ల్లి నూనెగుండ్ల‌ప‌ల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సెజ్ లలో ఈ భూమి కేటాయింపు జ‌రిగింది. అయితే రెండు సంవత్స‌రాల కాలంలో ప‌రిశ్ర‌మ‌లు పెట్టి ఉపాధి క‌ల్పించాలి. లేక‌పోతే ప్ర‌భుత్వం ఆ భూమిని తిరిగి తీసుకునే అధికారం ఏ ప్ర‌భుత్వానికైనా ఉంటుంద‌ని అప్ప‌టి ఒప్పందంలో పేర్కొన్నారు. వినియోగించ‌ని భూమిని ఏపీఐఐసీ తిరిగి తీసుకుంటుంద‌ని జీవో లో స్ప‌ష్టంగా వివ‌రించారు.

ఇప్పుడా నిబంధ‌న ప్ర‌కార‌మే అమ‌ర‌రాజా కంపెనీ నుంచి వెన‌క్కి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 483 ఎక‌రాల్లో 229 ఎక‌రాల‌ను మాత్ర‌మే వినియోగించుకుంది. దీంతో మిగిలిన భూమిని ప్ర‌భుత్వం ఏపీఐఐసీ స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో జ‌య‌దేవ్ కు సర్కార్ నుంచి షాక్ త‌ప్ప‌లేదు. గ‌ల్లాకి తగిలిన ఝ‌ల‌క్ మిగ‌తా టీడీపీ నేత‌ల‌కు త‌గిలే అవ‌కాశం క‌నిపిస్తోంది. వైజాగ్ లో 300 ఎక‌రాలు సినీ ప‌రిశ్ర‌మ అభివృద్దికి వైఎస్సార్ కేటాయించారు. త‌ర్వాత ఆ భూమిని టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న వియ్యంకుడు, ఎంపీ బాల‌కృష్ణ చేతుల్లో అభివృద్దిలో భాగంగా పెట్టారు. కానీ అక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌రిశ్ర‌మ అభివృద్దికి అప్ప‌టి ప్ర‌భుత్వం పునాది రాయి కూడా వేయ‌లేదు. ఇటీవ‌లే టాలీవుడ్ పెద్ద‌ల‌తో జ‌రిగిన భేటీలో సీఎం జ‌గ‌న్ ఆ సంగ‌తి కూడా చూస్తాన‌ని మాటిచ్చిన సంగ‌తి తెలిసిందే.