ముందు ఇద్దరి మధ్య స్ర్టీట్ ఫైట్ అన్నారు. ఆ తర్వాత చిన్న గ్యాంగ్ వార్ అన్నారు. ఇంకాస్త ముందుకెళ్తే చిన్న భూ వివాదం అన్నారు. మరో అడుగు ముందుకేసి ఇది ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధం అన్నారు. తాజాగా ఇది పొలిటికల్ వార్ అంటున్నారు. మరి ఇందులో ఏది నిజం? ఎవరు నిజం? ఎవరు అబద్ధం? ఈ వివాదానికి అసలు కారణం ఎవరు? ఎవరు కారణంగా సందీప్ బలయ్యాడు? అసలు పండు నేపథ్యం ఏంటి? ఇది బెజవాడ దుర్గమ్మ సాక్షిగా ప్రజల్లో రేకెత్తుతోన్న సందేహాలు. బెజవాడ నడిబొడ్డున సందీప్ – పండు గ్యాంగ్ లు రాళ్లు, రాడ్లు, కత్తులు, బీరు బాటిళ్లతో తలపడిన ఘటనలో సందీప్ మృతి చెందిన సంగతి తెలిసిందే.
పోలీసులు కేసు నమోదు చేసి ఇది చిన్న భూవివాదం గా తేల్చారు. కానీ సందీప్ తల్లి ఇది భూ వివాదం కాదని గట్టిగా చెబుతున్నారు. పొలిటికల్ యుద్ధమని కొత్త వాదనని తెరపైకి తీసుకొచ్చారు. తన కుమారుడుకి స్థానికంగా మంచి పేరు ఉందని..మంచి మనసుతోనే అక్కడి ప్రజలకు దగ్గరయ్యాడని తెలిపారు. ఎంతో మంది పేద విద్యార్థులను చదువు చెప్పించాడని…సహాయం అంటూ తన ఇంటి గుమ్మం తొక్కితే సహాయం చేయకుండా పంపిచేవాడు కాదన్నారు. అలా ప్రజల్లో మంచి కి మారుపేరుగా నిలిచాడన్నారు. తను కేవలం వ్యాపారం మాత్రమే చేస్తాడని..ఎలాంటి గ్యాంగ్ వార్ లలో తలదూర్చే వ్యక్తి కాదని అన్నారు.
అలాగే త్వరలో జరగబోయే విజయవాడ కార్పోరేట్ ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు ఆ తల్లి చెప్పారు. అధికార పార్టీ వ్యక్తులే సందీప్ ని మట్టుబెట్టారని కన్నీరు మున్నీరయ్యారు. ఆ ఏరియాలో కార్పోరేటర్ గా కచ్చితంగా గెలుస్తాడు! అన్న కారణంగా అధికార పార్టీ వాళ్లు అడ్డు తప్పించాలని ఇలా కుట్ర పన్నారంటూ ఆరోపించారు. అలాగే పండు అనే వ్యక్తి తనకి ఫోన్ చేసి ఎన్నోసార్లు బెదిరించాడని…ఇంటికొచ్చి వార్నింగ్ ఇవ్వడంతోనే సందీప్ కోపంతో పండు మీదకు వెళ్లినట్లు పెద్దావిడ వాపోయారు. ఆ బెజవాడ దుర్గమ్మ సాక్షిగా ఇందులో రాజకీయ కోణం ఉందని..పోలీసులు కేసును సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేసారు. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న విజయవాడ కమీషనర్ తిరుమలరావు భూ వివాదంగా చెప్పుకొచ్చారు.