తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఖాళి అయిన పిసిసి అధ్యక్ష పదవికి సరైన నాయకుడిని ఎన్నుకునే పనిలో పార్టీ హై కమాండ్ ఉంది. ఈ విషయమై పెద్ద చర్చ రచ్చగా జరుగుతోంది.ఈ పక్రియను ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ కి అప్పగించింది. ఎప్పుడు లేని విధంగా అధ్యక్ష పదవిని అభిప్రాయం సేకరణతో ఎన్నుకోవాలని పార్టీ అనుకుంటుంది. కానీ ఈ పదవిని చేపట్టేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతా ఉత్సాహం చూపిస్తున్నారు.అధిష్టానం ఆశీస్సులు తమకు ఉన్నాయి అంటే తమకు ఉన్నాయి అన్నట్లుగా నాయకులంతా వ్యవహరిస్తున్నారట.
ఇప్పటికే పార్టీ నేతల అభిప్రాయాలను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ సేకరించడం జరిగిపోయింది. ముఖ్యంగా ఈ పదవి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ ఇద్దరిలో ఒకరికి దక్కబోతోంది అనే విషయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన తరుణంలో, రేవంత్– కోమటిరెడ్డి వర్గాలు అప్పుడే పిసిసి పదవి కన్ఫామ్ అయిపోయినట్లుగా హడావుడి మొదలుపెట్టారు.వాస్తవంగా రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చేందుకు అధిష్టానం సైతం మొగ్గు చూపిస్తున్నా, పార్టీలోని సీనియర్ నాయకులు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. రేవంత్ కు కాకుండా సీనియర్ నాయకులు ఎవరికి ఇచ్చిన తమకు అంగీకారమే అన్నట్లు గా చెబుతున్నారు.మరికొద్ది రోజుల్లో ఎవరికి ఈ పదవి దక్కుతుంది అనే విషయం క్లారిటీ రాబోతోంది.
సరిగ్గా ఈ సమయంలోనే తనకు పిసిసి అధ్యక్ష పదవి వస్తే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలోని ప్రతి గడపను పలకరించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తాను అంటూ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో, ఒక్కసారిగా సీనియర్లలో కంగారు పెరిగిపోయిందట.ఇంకా అధ్యక్ష పదవి ఎవరికి కన్ఫామ్ అయ్యింది అనేది తేలకుండానే రేవంత్ పాదయాత్ర ప్రకటన చేయడం చూస్తుంటే, ఆయనకు పదవి రాబోతుందనే విషయం ముందుగానే లీక్ అయ్యిందా అనేది సీనియర్ నాయకులతో పాటు, రాజకీయ వర్గాలను హాట్ టాపిక్ గా మారింది. ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ చేపట్టిన అభిప్రాయ సేకరణలోనూ మెజార్టీ నాయకులు రేవంత్ వైపు మొగ్గు చూపారని లీకులు రావటంతో, పాదయాత్ర విషయమై అధికారిక ప్రకటన చేశాడని, ఖచ్చితంగా పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని రేవంత్ కు సూచనప్రాయంగా తెలియచేయటంతోనే ఇంత ధైర్యంగా పాదయాత్ర ప్రకటన చేసినట్లుగా , ఇక ఆ పదవి ఆయనకే అని నిర్ధారణకు వచ్చేస్తున్నారు.