మునుగోడు ఉప ఎన్నిక: కేసీయార్ ఆందోళన చెందుతున్నారా.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి వామపక్షాలతో అవసరమొచ్చింది. ఏ కేసీయార్ అయితే, వామపక్షాల్ని తోకపార్టీలుగా అభివర్ణించారో, ఆ తోకపార్టీలతో ఆయన మునుగోడు ఉప ఎన్నికలో గట్టెక్కాలని చూస్తున్నారు. అంతేనా, ఈ కలయిక జాతీయ రాజకీయాలకూ కొనసాగాలని కేసీయార్ ఆకాంక్షిస్తున్నారు.

జాతీయ రాజకీయాల సంగతి దేవుడెరుగు, ముందైతే తెలంగాణలో త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో కేసీయార్ గట్టెక్కుతారా.? లేదా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక విషయానికొస్తే, అధికార పార్టీకి అడ్వాంటేజ్ వుంటుంది. అధికారంలో వున్నారు కదా.. అందుకే, ఆ అధికార దర్పంతోనే, హైద్రాబాద్ నుంచి మునుగోడు వరకూ భారీ ర్యాలీ తీశారు కేసీయార్.

వేలాది వాహనాలతో మునుగోడుకి పయనమైన కేసీయార్, మునుగోడు బహిరంగ సభలో వామపక్షాలకు థ్యాంక్స్ చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక రావాల్సిన అవసరమేముందంటూ ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎలా వచ్చిందో, ఇంచుమించు అలాగే మునుగోడు ఉప ఎన్నిక కూడా వచ్చింది. ‘సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం వుండగా, ఇప్పుడు మునుగోడు ఉఫ ఎన్నిక రావడమేంటి.?’ అని కొంత అసహనం వ్యక్తం చేశారు కేసీయార్.

రైతులకు విద్యుత్ మీటర్లు సహా పలు అంశాలపై కేంద్రాన్ని నిలదీసేశారు. గడచిన ఎనిమిదేళ్ళలో తెలంగాణను తాము ఉద్ధరించేశామనీ కేసీయార్ చెప్పుకున్నారు. భారీ జన సమీకరణ, గులాబీ నేతలు కేసీయార్ మీద కురిపించిన పొగడ్తలు.. ఇవన్నీ ఓ యెత్తు. కేసీయార్‌లో మునుగోడు విషయమై అనుమానాలు ఇంకో యెత్తు. దుబ్బాక, హుజూరాబాద్ పలితాలు రిపీట్ అయితేనో.?