మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో లేరని కాంగ్రెస్ జాతీయ స్థాయి నేత ఉమన్ చాందీ వ్యాఖ్యానించడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. నిజమే, చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో లేరు. ఆయనే పలు సందర్భాల్లో ఆ విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు.
రాజకీయాలకు దూరంగా వున్నానని చిరంజీవి చెప్పడమంటే, కాంగ్రెస్ పార్టీలో తాను లేనని చిరంజీవి స్పస్టతనిచ్చినట్లే కదా. అదే విషయాన్ని ఉమన్ చాందీ కుండబద్దలుగొట్టేశారని అనుకోవాలి. అయితే, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజా నాథ్ మాత్రం, చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే వున్నారని చెబుతున్నారు.
‘చిరంజీవిని కాంగ్రెస్ వాదిగానే మేం చూస్తున్నాం. ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయతతో వ్యవహరిస్తారు. ఆయన కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీతోనే వుంది. ప్రస్తుతం సినిమాలతో చిరంజీవి బిజీగా వున్నారు. సేవా కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా వున్నారు చిరంజీవి..’ అంటూ శైలజానాథ్ వ్యాఖ్యానించడంతో అంతా విస్మయానికి గురయ్యారు. చిరంజీవి కుటుంబంలో ఓ సోదరుడు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీని స్థాపించారు.. అదీ 2014 ఎన్నికల సమయంలో. ఇంకో సోదరుడు నాగబాబు, 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేశారు.
మరి, చిరంజీవి కుటుంబంలో ఎవరు ఇంకా కాంగ్రెస్ పార్టీతో విధేయంగా వుంటున్నట్లు.? పోనీ, చిరంజీవి రాజ్యసభ పదవీ కాలం ముగిశాక, కాంగ్రెస్ పెద్దలెవరైనా చిరంజీవితో చర్చించి, తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాల్సిందిగా ఆయనకు సూచించారా.? లేదు కదా.? అయినా, చిరంజీవి పేరు చెప్పుకుని కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఓట్లు అడిగే పరిస్థితే లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికే లేకుండా పోయింది ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన సమయంలో అప్పటి కేంద్ర మంత్రి చిరంజీవి కొన్ని ప్రతిపాదనలు చేశారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనల్ని లైట్ తీసుకుంది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాశనమైపోయింది.