IPL 2021: ఈరోజు ఏ జట్టు ఏ జట్టుతో తలపడుతోంది.? ఎవరు ఎంత స్కోర్ చేశారు.? ఎవరు గెలిచారు.? ఇలాంటి అంశాలపై సాధారణ ప్రజల్లో పెద్దగా ఆసక్తి కనిపించడంలేదు. మరీ క్రికెట్ పిచ్చి వున్నవాళ్ళు తప్ప, క్రికెట్ మీద ఓ మోస్తరుగా అభిమానం వున్నవాళ్ళు కూడా ఈసారి ఐపీఎల్ పోటీల పట్ల ఆసక్తి చూపకపోవడానికి కారణం కరోనా వైరస్. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో, ఆ అంశాల మీదనే ఆసక్తి కనిపిస్తోంది అందరిలోనూ.
కరోనా వార్తలకు వున్న క్రేజ్ ప్రస్తుతం ఇంకే ఇతర వార్తలకీ కనిపించడంలేదు. భయం వల్ల కావొచ్చు, ఇంకో కారణంతో కావొచ్చు.. టీవీలకు ఎక్కువమంది అతుక్కుపోతున్నది.. కేవలం కరోనా అంశాలకే. క్రికెట్ మాత్రమే కాదు, సాధారణ వినోదం విషయంలోనూ బుల్లితెర డీలాపడిందన్న చర్చ మీడియా వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదిలా వుంటే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ గతంతో పోల్చితే చాలా చప్పగా సాగుతోంది.
కొన్ని జట్లు ఉత్తమ ప్రదర్శన ఇస్తున్నా, అత్యుత్తమ ప్రదర్శన.. అనదగ్గ మ్యాచ్ ఏదీ ఇప్పటిదాకా జరగలేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత సీజన్, యూఏఈలో జరిగింది.. కరోనా నేపథ్యంలో. కానీ, కాస్తో కూస్తో క్రేజ్ కనిపించింది ఆ పోటీల్ని టీవీల్లో తిలకించడానికి. ఇప్పుడు ఆ పరిస్థితే కనిపించడంలేదు. నిజానికి, కరోనా భయాల నేపథ్యంలో కాస్తంత డైవర్షన్ కోసం అయినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ వైపు బుల్లితెర వీక్షకులు ఫోకస్ పెట్టి వుండాల్సింది. అదే అంచనాతో ఈసారి ఐపీఎల్ ప్రారంభమయ్యింది. కానీ, ఆ అంచనాలన్నీ తల్లకిందులయ్యేలానే కనిపిస్తున్నాయి.
ఇక, టీవీల్లో విడుదలవుతున్న కొత్త సినిమాలు కూడా ప్రేక్షకాదరణ పొందలేకపోతుండడం గమనార్హం. అన్నట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ బెట్టింగులు కూడా ఈసారి గణనీయంగా తగ్గిపోయాయి. జనం చేతుల్లో డబ్బుల్లేకపోవడమొక్కటే కాదు, క్రికెట్ మీద ఆసక్తి తగ్గడంతోనే ఈ పరిస్థితి అని బెట్టింగ్ కింగులు వాపోతున్నారు. అలాగని, అసలు బెట్టింగులే జరగడంలేదని అనలేం. ఆ పైత్యం బాగా ఎక్కువైపోయినోళ్ళు, బెట్టింగుల్ని వదులుకుంటారా.? ఛాన్సే లేదు.