చిరంజీవి, శ్రీదేవి కాంబో మూవీ వజ్రాల దొంగ ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఎదిగిన సెలబ్రిటీలలో చిరంజీవి, శ్రీదేవి ముందువరసలో ఉంటారు. అయితే అటు చిరంజీవి ఇటు శ్రీదేవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే నిర్మాతలుగా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చిరంజీవి నిర్మాతగా పలు సినిమాలను నిర్మించినా శ్రీదేవి మాత్రం తను నిర్మించాలని భావించిన తొలి సినిమా ఆగిపోవడంతో సినిమాల నిర్మాణానికి దూరం కావాల్సి వచ్చింది.

లతా ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో శ్రీదేవి చెల్లెలు శ్రీలత నిర్మాతగా శ్రీదేవి హీరోయిన్ గా వజ్రాల దొంగ అనే సినిమా చాలా సంవత్సరాల క్రితం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. శ్రీదేవి ఈ సినిమా కొరకు బప్పి లహరిని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేయడంతో పాటు పాటలను రికార్డ్ చేయించుకున్నారు. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించాలని అనుకునే సమయానికి సినిమా ఆగిపోయింది.

ప్రముఖ రచయితలలో ఒకరైన యండమూరి వీరేంద్రనాథ్ మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన మౌన రాగం సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఆధారంగా వజ్రాల దొంగ స్క్రిప్ట్ సిద్ధమైంది. చెన్నైలో ఒక పాట షూట్ పూర్తయ్యాక ఈ సినిమా హక్కుల కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. అయితే ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడటంతో కోదండ రామిరెడ్డికి ఈ సినిమా ఫలితం విషయంలో డౌట్ వచ్చింది.

కోదండ రామిరెడ్డి ఇదే సందేహాన్ని శ్రీదేవి దగ్గర వ్యక్తం చేశారు. శ్రీదేవి మరో మంచి కథతో సినిమా చేద్దామని లేదా ఇదే కథకు మార్పులు చేద్దామని సూచనలు చేశారు. కథలో మార్పులు చేసినా కథ ఆశించిన విధంగా లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత మిస్టర్ ఇండియా సినిమాను తెలుగులో రీమేక్ చేద్దామని శ్రీదేవి చెప్పినా చిరంజీవి అంగీకరించలేదు. ఈ విధంగా చిరంజీవి శ్రీదేవి కాంబో మూవీ వజ్రాల దొంగ ఆగిపోయింది.