ఆంధ్రప్రదేశ్ లో ఏ అన్నా.. ఏ తమ్ముడూ మద్యానిక బానిస కాకూడదు. తన ఫ్యామిలీతో సంతోషంగా గడపాలి అంటే ఏపీలో మద్యపానాన్ని నిషేధం చేయాలి. కానీ.. ఒక్కసారిగా నిషేధం అంటే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే.. విడతల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తాం. అంటూ ఏపీ సీఎం జగన్ ఏపీలో సరికొత్త రూల్ ను తీసుకొచ్చారు.
మద్యపాన నిషేధం పేరుతో వైన్స్ షాపుల టెండర్స్ దగ్గర్నుంచి బ్రాండ్స్ వరకు అన్నింట్లోనూ మార్పులు వచ్చాయి. బెల్ట్ షాపులను పూర్తిగా తీసేసి… ప్రభుత్వమే ప్రస్తుతం మద్యాన్ని సరఫరా చేస్తోంది. షాపులను పెట్టి మద్యం అమ్ముతోంది. మద్యం ధరలను కూడా విపరీతంగా పెంచింది. ఏంటి ఇది.. అని అడిగితే.. మద్యపాన నిషేధంలో ఇదీ ఒక భాగం అని చెబుతున్నారు అధికారులు.
అంతేనా.. రాష్ట్రానికి రోజురోజుకూ అక్రమంగా తరలిస్తున్న మద్యం ఏరులై పారుతోంది. అక్రమంగా మద్యాన్ని రవాణా చేసేవాళ్లు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. వాళ్ల చేష్టలు ఎలా ఉన్నాయంటే… ఎవ్వరి మాటా వినడం లేదు. పోలీసుల మాటైతే అస్సలు వినడం లేదు.
తాజాగా జరిగిన ఓ ఘటనే దీనికి నిదర్శనం. అది కూడా సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో జరిగింది ఘటన. కడప జిల్లాలోని పులివెందుల లో అక్రమంగా మద్యాన్ని రవాణా చేస్తున్న ఓ వ్యక్తి బరితెగించాడు. అక్రమంగా మద్యం తరలిస్తున్నారని తెలుసుకున్న ఎస్సై.. ఆ వాహనానికి అడ్డురావడంతో ఆ ఎస్సైని ఢీకొంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ వాహనం. ఈ ఘటన పక్కనే ఉన్న సీసీకెమెరాలో రికార్డయింది. చాకచక్యంగా వ్యవహరించి ఎస్ఐ ప్రాణాలతో బయటపడ్డాడు గానీ.. లేకుంటే ఎస్సై ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి.
వాహనాల తనిఖీలు చేస్తున్న ఎస్సై గోపీనాథ్ రెడ్డికి అటుగా వెళ్తున్న ఓ కారును చూసి అనుమానం వచ్చింది. దీంతో వెంటనే ఆ కారును ఆపే ప్రయత్నం చేశాడు. దీంతో లోపల ఉన్నవాళ్లు కారును ఆపకుండా ఇంకాస్త వేగంగా పోనిచ్చారు. అయినప్పటికీ ఆ ఎస్సై కారును పట్టుకున్నాడు. ఎస్సై కారుకు వేలాడుతున్నా కారును ఆపలేదు ఆ ప్రబుద్ధులు. అలాగే రెండు కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేస్తూ వెళ్లిపోయారు.
వెంటనే వెనకనుంచి కారును ఫాలో అయిన ఇతర పోలీసు వాహనాలు కారును అడ్డుకున్నాయి. ఇంతలో ఎస్సై గోపీనాథ్ రెడ్డి కారు అద్దాలను పగులగొట్టారు. ఆ తర్వాత కారును ఆపి డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని.. కారులో తరలిస్తున్న 80 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
సీఎం సొంత నియోజకవర్గంలో ఇలా అక్రమంగా మద్యం తరలిస్తుండటం స్థానికంగా సంచలనం లేపింది. అయితే.. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని చాకచక్యంగా, ఎంతో సాహసంతో పట్టుకున్న ఆ పోలీస్ ను సీఎం జగన్ ఫోన్ చేసి మరీ అభినందించారట.