బిహార్ సీఎం, నితీష్ కుమార్ జేడీయూ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఉన్నతాధికారి ఆర్‌సీపీ సింగ్ కు జేడీయూ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన గంటల వ్యవధిలోనే నితీష్ కుమార్ మరో కీలక ప్రకటన చేశారు.
ముఖ్యమంత్రి పదవి తనకు అక్కర్లేదన్నారు. జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తుందని జనాలు మాట్లాడుకుంటున్నారు. సీఎం కుర్చికి నేను అంకితం కాలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించలేనని సంకీర్ణానికి తెలియజేశాను.
కానీ వారు అంగీకరించలేదు. ఎంతో ఒత్తిడి తర్వాత నేను మరో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. ఈ పదవి పట్ల నాకు ఏ మాత్రం ఆసక్తి లేదు.. అక్కర్లేదు అని స్పష్టం చేశారు. ఇక నితీష్ వ్యాఖ్యలు ఎన్‌డీఏ కూటమిలో కలకలం రేపుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై జేడీయూ అసంతృప్తి వ్యక్తం చేసింది. కూటమి రాజకీయాలకు ఇది మంచి సంకేతం కాదని స్పష్టం చేసింది.