Shiva Reddy: నేను చేసిన పనికి రఘుబాబు నన్ను కొడతారేమోనని చాలా భయపడ్డా: శివారెడ్డి

Shiva Reddy: తాను అలీతో కలిసి బయటి దేశాలకు వెళ్లినపుడు తన కంటే ఎక్కువగా ఆయనే బాగా నవ్విస్తారని నటుడు శివారెడ్డి తెలిపారు. వచ్చేవాళ్లను, పోయే వాళ్లను, వస్తువుల గురించి కామెంట్స్‌ చేసి బాగా నవ్విస్తారని ఆయన అన్నారు. అంతే కాకుండా తమ లాంటి కళాకారులందరూ కలిసి మాట్లాడుకునేటపుడు కూడా ఆయన బాగా సరదాగా ఉంటారని శివారెడ్డి చెప్పారు. కానీ ఎవరైనా టీవీల్లో చేసేటపుడు గానీ, స్టేజ్ మీద ఎవరైనా ప్రదర్శన చేస్తున్నపుడు గానీ తాను బాగా ఎంజాయ్ చేస్తానని ఆయన అన్నారు. ఎందుకంటే తాను ఫర్మామెన్స్ చేయడమే ఎక్కువగా జరుగుతుందని, వేరొకరి ఫర్మామెన్స్‌ను చూసి ఎంజాయ్ చేసే టైం చాలా తక్కువ అని ఆయన చెప్పారు. అందుకే ఏదైనా కామెడీ ప్రోగ్రామ్స్‌కి తనను జడ్జ్‌గా పిలిస్తే కచ్చితంగా వెళ్తుంటానని ఆయన స్పష్టం చేశారు.

శ్రీను వైట్ల గారి నమో వెంకటేశ సినిమా కోసం యూరప్‌కి వెళ్లినపుడు జరిగిన ఓ సన్నివేశాన్ని శివారెడ్డి ఈ విధంగా పంచుకున్నారు. పొద్దున్నే 4గంటలకే లేపే వారు, విపరీతమైన చలి, ఆ టైంలో లేచి 5గంటలకల్లా బస్సులో కూర్చోవాలి, 6,7గంటలకల్లా లొకేషన్‌కు చేరుకోవాలి అని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్టిస్ట్‌లు అందరూ కూడా ఒకే బస్సులో వెళ్లేవాళ్లమని, ఒకసారి అలా వెళ్తున్నపుడు తాను అలీ పక్కన కూర్చున్నానని శివారెడ్డి తెలిపారు.

అయితే అలీ గారు కామెడీగా అందరి మీద నీళ్లు పోస్తున్నట్టుగా చేసి, అందర్నీ నవ్వించారని శివారెడ్డి అన్నారు. అది చూసి అన్నా నేను కూడా చేస్తాను. వెనక రఘుబాబు ఉన్నాడు అని చెప్పి, అలీ దగ్గర్నుంచి బాటిల్‌ తీసుకున్నానని ఆయన అన్నారు. వెంటనే రఘుబాబు దగ్గరికి వెళ్లి, అలీ గారి లాగే తాను కూడా నీళ్లు పోస్తున్నట్టు బాటిల్‌తో ఆయనమీద సౌండ్ చేశానని, అయితే అలీ తనకు బాటిల్ ఇచ్చేటపుడు దాని మూత కొంచెం వదులు చేసి ఇచ్చారని ఆయన చెప్పారు. ఆ విషయం తెలియక తాను కూడా అలా చేసే సరికి నీళ్లన్నీ రఘుబాబు మీద పడ్డాయని, అది చూసి ఆయన తిట్టబోయి చాలా కంట్రోల్ చేసుకున్నారని ఆయన తెలిపారు. నీళ్లన్నీ ఆయన మీది నుంచి కారుతున్నాయి.. దానికి తోడు చలి అని, అది చూసి తాను ఆయన ఏమంటాడో అని చాలా భయపడ్డానని శివారెడ్డి అన్నారు.

రఘుబాబుతో మంచి స్నేహం ఉంది. కానీ అలీతో ఉన్నంత క్లోజ్‌నెస్ లేదని, ఇప్పుడు అందరూ ఏమనుకుంటారో అని తాను భయపడుతూ కొడతారేమోనని అనుకున్నట్టు శివారెడ్డి తెలిపారు. ఆయన మాత్రం ఏం మాట్లాడకుండా అలా కూర్చునే ఉన్నారని, కాసేపయ్యాక ఏంటయ్యా చూసుకోవాలి కదా అని అన్నారని శివారెడ్డి తెలిపారు. ఆ తర్వాత అలీ గారు తానే క్యాప్ వదులు చేసి ఇచ్చానని చెప్పడంతో కూల్ అయ్యారని ఆయన వివరించారు.