హుజూరాబాద్ బ్యాలెట్ పైట్.. ఎవరి మధ్య.?

Huzurabad Ballot Fight between..

Huzurabad Ballot Fight between..

‘హుజూరాబాద్ బ్యాలెట్ ఫైట్.. కేసీఆర్ అహాంకారానికీ, ఈటెల రాజేందర్ ఆత్మగౌరవానికీ మధ్య జరుగుతోంది..’ అంటున్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. అదేంటీ, రెండు పార్టీల మధ్య కదా బ్యాలెట్ వార్ జరిగేది.? అంటే, హుజూరాబాద్ లెక్క వేరు.. అన్నది ఈటెల రాజేందర్ ఉవాచ. నిజానికి, ఈటెల రాజేందర్ వ్యవహారాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి లైట్ తీసుకుంది. పోటీ తెలంగాణ రాష్ట్ర సమితికీ, భారతీయ జనతా పార్టీకి మధ్యనే.. అన్నది గులాబీ పార్టీ వాదన. ఇంతకీ, కాంగ్రెస్ పార్టీ పరిస్థితేంటి.? అంటే, కాంగ్రెస్ అసలిక్కడ ప్రధాన ప్రత్యర్థే కాదని తెలంగాణ రాష్ట్ర సమితి చెబుతోంది.

దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభావం కనిపించలేదు. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లోనూ అంతే. కానీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో మాత్రం సీన్ మారింది. హుజూరాబాద్ నియోజకవర్గం విషయానికొస్తే, అక్కడ ఈక్వేషన్ ఎలా వుంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. అయితే, హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి సొంతంగా వున్న బలం తక్కువ. అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి చాలా బలంగా వుంది. ఆ తర్వాత కాస్తో కూస్తో బలంగా వున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. టీడీపీకి కూడా కాస్త బాగానే క్యాడర్ వుందక్కడ.. కానీ, నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

ఈటెల రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గంలో సమీకరణాలు వేగంగా మారాయి. దాంతో, ఈటెల వర్సెస్ కేసీఆర్.. అనే ప్రస్తావన కంటే, టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న ప్రస్తావనే తమకు మేలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి నమ్మతోంది. ఇంకోపక్క బీజేపీ, తమ ప్రభావం కంటే ఈటెల ప్రభావమే హుజూరాబాద్ ఉప ఎన్నికలో కీలకమని భావిస్తోంది. తద్వారా బీజేపీ ముఖ్య నేతల జోక్యం.. ప్రస్తుతానికి తక్కువే వుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికవరకు. అయితే, ఇంకా ఉప ఎన్నిక తేదీ ఖరారు కాలేదు. ఖరారైతే, ఆ తర్వాత ఎవరి వ్యూహాలు వాళ్ళకి వుంటాయ్.. అప్పుడు సమీకరణాలూ మారిపోతాయ్.