
రిజర్వుడు కోటా వున్న నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన, గెలిచిన రాజకీయ నాయకుల మీద తరచూ కేసులు నమోదవుతుంటాయి. ఫేక్ సర్టిఫికెట్లతో రిజర్వుడు స్థానాల నుంచి పోటీ చేశారంటూ. తెలుగునాట పలువురు మంత్రుల మీద ఈ తరహా ఆరోపణలున్నాయి. గతంలోనూ పలువురు ఈ తరహా వివాదాల్ని ఎదుర్కొన్నారు. తాజాగా ఎంపీ నవనీత్ కౌర్.. కోర్టు నుంచి షాక్ తినాల్సి వచ్చింది.
మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ నియోజకవర్గం నుంచి నవనీత్ కౌర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. నవనీత్ కౌర్ గతంలో పలు తెలుగు సినిమాల్లో గ్లామరస్ కథానాయికగా నటించి మెప్పించారు. రాజకీయాల్లోకి వస్తూనే, నవనీత్ కౌర్ మంచి విజయాన్ని అందుకున్నారు. ఎంపీగా గెలిచాక, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో వుండటమే కాక, పార్లమెంటులోనూ తనదైన స్టయిల్లో గళం విప్పుతూ వస్తున్నారు. పార్లమెంటులో వివిధ సమస్యలపై నవనీత్ కౌర్ అనర్ఘలంగా మాట్లాడుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే, మహారాష్ట్రలో అధికారంలో వున్న శివసేనతో నవనీత్ కౌర్ పలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు రాజకీయంగా.
ఈ క్రమంలోనే శివసేన నేత ఒకరు నవనీత్ కౌర్ మీద కోర్టుకు వెళ్ళారు.. ఆమె ఫేక్ సర్టిఫికెట్ ద్వారా రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేసి గెలిచారని. ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ ఫేక్ అని న్యాయస్థానం తేల్చడంలో నవనీత్ కౌర్ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. అది ఫేక్ కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఆమె మీద పడింది. అయితే, అదంత తేలికైన విషయం కాదు. సర్టిఫికెట్ రద్దుపై న్యాయపోరాటం చేసి, విజయం సాధిస్తేనే ఆమ తన ఎంపీ పదవిని నిలబెట్టుకోగలుగుతారు. అన్నట్టు, సర్టిఫికెట్ రద్దుతోపాటు 2 లక్షల రూపాయల జరీమానా కూడా న్యాయస్థానం నవనీత్ కౌర్ కి విధించడం జరిగింది.
