దేశం కోసమే అమ్మేస్తున్నారట.. ఇదేం దేశభక్తి కమలనాథుల్లారా.?

Horrible patriotism Of BJP By Selling Nation

ప్రైవేటు కంపెనీలకు భూముల్ని కేటాయించడం కొత్తేమీ కాదు. ఆయా రంగాల్లో ప్రైవేటు పెట్టుబడుల్ని ప్రోత్సహించడాన్నీ తప్పు పట్టలేం. కానీ. ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేయడమేంటి.? ఇది ఏ రకంగా దేశభక్తి అవుతుంది.? ఈ ప్రశ్నలకు భారతీయ జనతా పార్టీ నేతల వద్ద సమాధానం లేదు. ‘దేశం కోసమే ప్రైవేటీకరణ.. ఆ ప్రైవేటీకరణను ఎవరైనా వ్యతిరేకిస్తే, వాళ్ళకసలు దేశం పట్ల బాధ్యత లేదు.. వారంతా దేశ్రదోహుల కిందే..’ అన్నట్టుంది బీజేపీ తీరు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ఏపీ బీజేపీ నేతల్లో ఇంకా చాలా ఆవలున్నాయి.. ప్రైవేటీకరణను ఆపగలమని. మిత్రపక్షం జనసేన పార్టీ కూడా, ‘కేంద్ర హోంమంత్రిని మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. మాకు ప్రైవేటీకరణను ఆపగలిగే శక్తి వుందని నమ్ముతున్నాం..’ అని చెబుతోంది. ‘విశాఖ ఉక్కు పరిశ్రమను రక్షించేది మేమే’ అని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా చెప్పారు. కానీ, బీజేపీ జాతీయ స్థాయి నేత సునీల్ దేవధర్ మాత్రం, ‘దేశం కోసమే ప్రైవేటీకరణ. విశాఖ ఉక్కు మాత్రమే కాదు, చాలా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ జరగబోతోంది..’ అని ఈ రోజు తాజాగా కుండబద్దలుగొట్టేశారు. సుమారు 20 వేల ఎకరాల భూమి విశాఖ ఉక్కు పరిశ్రమకు వుందని రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. సొంతంగా గనుల్ని కేటాయిస్తే, విశాఖ ఉక్కు లాభాల్లోకి వెళుతుందనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నారు. ఇంకేంటి సమస్య.? సొంతంగా గనులు లేకపోయినా, లాభాల్ని సంపాదించగలుగుతున్న విశాఖ ఉక్కు పరిశ్రమకి ఎప్పుడో ఓ సారి నష్టమొచ్చినంతమాత్రాన మొత్తంగా దాన్ని అమ్మేయడమేంటి.? ఇది జాతి సమస్య. తెలుగు జాతి సమస్య. పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా, ఆంధ్రపదేశ్‌కి బాసటగా నిలిచింది. అలాంటప్పుడు, కేంద్రమెందుకు అమ్మేయాలనుకుంటోంది.? దీన్ని దేశభక్తి, దేశం కోసం.. అని అనగలమా.? అవకాశమే లేదు.