కేంద్రంలో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. కేంద్రం రైతుల కోసం తీసుకొస్తున్న బిల్లులకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
వ్యవసాయం రంగంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా కేంద్రం కొన్ని బిల్లులను తీసుకొస్తోంది. కానీ.. ఆ బిల్లుల వల్ల పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని రైతులకు నష్టం వాటిల్లుతుందని.. ఆయా రాష్ట్రాల నుంచి కొన్ని రోజుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
అయినప్పటికీ.. కేంద్రం ఆ బిల్లులకు సంబంధించి లోక్ సభలో ఇవాళ ఓటింగ్ నిర్వహించింది. దీంతో ఆ బిల్లుకు నిరసన తెలుపుతూ.. ఎన్డీఏలో భాగస్వామ్యమైన శిరోమణి అకాలీ దల్(ఎస్ఏడీ) పార్టీకి చెందిన కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తన పదవికి రాజీనామా చేశారు.
ఈ విషయాన్ని ఎస్ఏడీ పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి భర్త సుఖ్ బీర్ బాదల్ పార్లమెంట్ లో ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. బీజేపీ పార్టీకి, ప్రభుత్వానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. కానీ… రైతుల విషయంలో ప్రభుత్వం రాజకీయాలు చేస్తే ఊరుకోమన్నారు. రైతులకు అన్యాయం జరిగే బిల్లులకు తాము ఎప్పటికీ మద్దతు ఇవ్వమని.. అందుకే తమ పార్టీ సభ్యురాలు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
మోదీ కేబినేట్ లో శిరోమణి అకాలీ దల్ పార్టీ నుంచి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఒక్కరే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్డీఏలో ఎస్ఏడీ పార్టీ చాలా ఏళ్ల నుంచి భాగస్వామ్యంగా ఉంది. ఈ పార్టీ పంజాబ్ కు చెందినది.
కొత్తగా వస్తున్న రెండు అగ్రికల్చర్ బిల్లులు 50 ఏళ్ల నుంచి పంజాబ్ ప్రభుత్వాలు నిర్మించుకుంటూ వస్తున్న అగ్రి సెక్టార్ నే నాశనం చేసేలా ఉన్నాయంటూ దుయ్యబట్టారు.
హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ప్రస్తుతం ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.