తెలంగాణ మంత్రి హరీశ్ రావు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ నేత కమలాకర్ రెడ్డి.. టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు.. బండి సంజయ్ పై విరుచుకుపడ్డారు. ఆరేళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం.. అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నదని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి చిత్తశుద్ధి ఉందా? నిజాయితీ ఉందా? ఉంటే వీటికి సమాధానం చెప్పాలి. బీజేపీ నేతల చిత్తుశుద్ధి నిరూపించుకోవాలి. బీజేపీ నాయకులకు నైతిక విలువలు ఉన్నాయా అసలు. తెలంగాణ రాగానే.. తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో కలిపి మీరు చేసింది ఏంటి.. అన్యాయం కాకపోతే. సీలేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్రలో కలిపి మీరు తెలంగాణకు ఏం చేశారు. బయ్యారం ప్రాజెక్టు ఏడ పోయింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రద్దు చేసిందెవరు? కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకుండా.. పోలవరాన్ని మాత్రమే ప్రకటించడం దేనికి నిదర్శనం. తెలంగాణలోని మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టుకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ తెలిపితే… ఎందుకు కేంద్రం ఇవ్వలేదు.. అంటూ బండి సంజయ్ ని ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ హరీశ్ రావు సవాల్ విసిరారు.