ఇంటింటికీ మువ్వన్నెల జెండా.! ఫ్లాగ్ కోడ్ పరిస్థితేంటి.?

ప్రతి ఇంటి మీదా జాతీయ జెండా ఎగరాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ‘ఆజాదీ కా అమృత మహోత్సవ్’ నేపథ్యంలో, ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర్య భారతావనిలో ప్రతి ఇంటి మీదా జెండా ఎగరడం అనేది మనందరికీ గర్వకారణమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా జెండాల రెపరెపలు కనిపిస్తున్నాయి. పొడవైన జెండాల్ని రూపొందించి, ప్రదర్శిస్తున్నారు. జాతీయ జెండాలతో బైక్ ర్యాలీలు తీస్తున్నారు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు.. ఈ మేరకు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికీ జెండాలు పంచే కార్యక్రమాల్ని ప్రభుత్వాలూ చేపడుతున్నాయి.

అంతా బాగానే వుందిగానీ, ఫ్లాగ్ కోడ్ మాటేమిటి.? జెండా ఎగురవేయడమంటే.. ఇష్టమొచ్చినట్లు చేసెయ్యడం కుదరదు. కానీ, జెండా విషయమై సామాన్యులకున్న అవగాహన ఏంటి.? అన్నది ప్రభుత్వాలేమైనా ఆలోచించాయా.? లేదాయె.

జెండాల్ని తమ ఇల్ళకు తగలించేశారు చాలామంది. వర్షానికి తడుస్తున్నాయ్.. గాలికి ఎగిరి, ఎక్కడో పడుతున్నాయి. బురదమయమవుతున్నాయి. అలా ఎగిరెగిరి రోడ్ల మీద వెళుతున్న వాహనాలకీ ఇబ్బందిగా మారుతున్నాయి. ఎందుకీ పరిస్థితి.? ఇంకెందుకు, జెండా విషయమై పౌరుల్లో ప్రభుత్వాలు అవగాహన కల్పించకపోవడం వల్లనే.

జాతీయ జెండాని గౌరవించుకోవడం మనందరి బాధ్యత. కానీ, ఆ జెండాకి తెలిసో, తెలియకో అవమానం మనమే చేస్తోంటే.? చివరికి జాతీయ జెండాతోనూ పబ్లిసిటీ స్టంట్లు చేసే స్థాయికి రాజకీయ నాయకులు దిగజారిపోతే, ప్రభుత్వాలు అందుకు అవకాశం కల్పిస్తోంటే.. నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి.